Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- హన్మకొండ
రాబోయే 2023 శాసనసభ ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రజా వేదిక రాష్ట్ర చైర్మన్ తిరునగరి శేషు డిమాండ్ చేశారు. శుక్రవారం బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్ట లోని హరిత హౌటల్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా రాష్ట్రంలోని 56 శాతం ఉన్న బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయపరంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడం లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఘోరంగా వైఫల్యం చెందాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 శాసన సభ స్థానాలలో ఎస్సీ 19 ఎస్టీ 12 రిజర్వుడు స్థానాలు మినహాయించి మిగిలిన ఎనభై ఎనిమిది స్థానాలలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సామాజికవర్గం నుంచి ప్రస్తుతం 20 మంది శాసనసభ్యులు ఉండడం ఏవిధమైన సామాజిక న్యాయం పాటిస్తున్నారో ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూతన కంటి ఆనందం, బిసి కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజన్ రావు, వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు సమ్మయ్య ,ఎంబిసి కులాల రాష్ట్ర కన్వీనర్ పాలడుగు సురేందర్, బీసీ జాక్ రాష్ట్ర కన్వీనర్ దారబోయిన సతీష్, బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు యశ్వంత్ యాదవ్ ,వినరు చారి తదితరులు పాల్గొన్నారు.