Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
పేదలకు బంచరాయి, పోరంబోకు, గ్రామకంఠం, తదితర రకాల ప్రభుత్వ భూములను పంచాలని వ్యకాస జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక మంగపతిరావు భవన్లో ఇమ్మడి లచ్చయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల కమిటీ సమావేశంలో వీరయ్య మాట్లాడారు. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములుండగా వాటిని భూస్వాములు, పెత్తందార్లు, ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకుని అనుభవిస్తుండగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాలు చొప్పున భూపంపిణీ చేస్తామని హామీ ఇచ్చి అమలును విస్మరించిందని విమర్శించారు. అలాగే అనేక దశాబ్దాలుగా పోడు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలివ్వాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా నాయకులు కందునూరి శ్రీనివాస్, వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, మండల నాయకులు కొండయ్య, ఇమ్మడి వెంకన్న, షేక్ జాన్మియా, శ్రీనివాస్, కేశవ్, పద్మ, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.