Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
- లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
పేదలు సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. మండలంలోని తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ ముల్కనూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 58 మంది లబ్దిదారులకు సీతక్క కల్యాణలక్ష్మీ చెక్కులను శుక్రవారం అందించారు. అనంతరం సీతక్క మాట్లాడారు. పేదలు ఆడపిల్లల వివాహం చేయడానికి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం నుంచి అందుతున్న కల్యానలక్ష్మీ సాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. బాల్యవివాహాలకు తావు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చదివించి, తదనంతరమే వివాహం చేయాలని కోరారు. ములుగు జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, ఎంపీపీ గొంది వాణిశ్రీ, జిల్లా కోఆప్షన్ సభ్యురాలు వలీయాబీ మాట్లాడారు. ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని చెప్పారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల పాలు కాకుండా చూసేందుకే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మీ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలకు రూపకల్పన చేసి దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు లబ్ది చేకూర్చుతున్నారని కొనియాడారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నాడని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, సహకార సంఘం చైర్మెన్ పులి సంపత్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్, వీఆర్వోలు వీరస్వామి, నర్సింహస్వామి, సారయ్య, తదితరులు పాల్గొన్నారు.