Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏ వస్తువు కొన్నా ఎమ్మార్పీ కన్నా అధికం
- ఆపదలో ఉన్నామని వస్తే అడ్డంగా దోచుకుంటున్నారని రోగి బంధువుల ఆవేదన
నవతెలంగాణ-మట్టెవాడ
పేదల పాలిట పెన్నిది ఉత్తర తెలంగాణ వరప్రదా యినిగా పేరుగాంచిన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి ప్రతి రోజు పేదలు వేల సంఖ్యలో చికిత్స కోసం వస్తుంటారు. ఆలాంటి పేద వారిని లక్ష్యంగా చేసుకుని ఎంజీఎంలో ఉన్న దుకాణాల యజమానులు ఎమ్మార్పీ కన్నా అధికంగా ధరలు పెంచి వస్తువులను విక్రయిస్తున్నారు. వార్డులకు దగ్గరగా ఉన్నాయని ఆస్పత్రిలోని చిల్లర దుకాణాల వైపు వెళ్తే వారి జేబులకు చిల్లు పడినట్లేనని రోగి బంధువులు చెబుతున్నారు. ఆసుపత్రి వార్డులో చికిత్స పొందే అటెండెంట్లు రోగిని చూడటానికి వచ్చే రోగి బంధువుల సౌకర్యార్థం ఎంజీఎం ఆస్పత్రి సిబ్బంది చిల్లర దుకాణాలకు అనుమతులు ఇచ్చారు. ఈ అనుమతులనే ఆసరాగా చేసుకున్న చిల్లర దుకాణాలు యజమానులు వారి చిల్లర కొట్టుల్లో దొరికే పాలు, బ్రెడ్, బిస్కెట్, వాటర్ బాటిల్, టీల పై బాదుడుకు తెరలేపారు. అడ్డంగా దోచుకోవడానికి అలవాటు పడిన చిల్లరకొట్టు వారు రోగి బంధువులు దుకాణాల వద్ద ఏ చిన్న వస్తువు కొన్నా వస్తువుల పైన ముద్రించిన ధరకు అదనంగా దండుకుంటున్నారు. వాటర్ బాటిల్ పై ఎమ్మార్పీ రూ. 20 ఉంటే అదనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. రూ.10 బిస్కెట్ ప్యాకెట్‌కు రూ.12 లు తీసుకుంటున్నారు. రూ.35 బ్రెడ్ ప్యాకెట్ పై రూ.40, రూ.12 పాల ప్యాకెట్‌కు రూ.20 తీసుకుని ప్రతి వస్తువులపై అదనంగా దండు కొని లాభార్జనే ధ్యేయంగా పేదలను దోచుకుంటున్నారు. ఇదేంటని రోగి బంధువులు నిలదీయగా మేము ఇంతే ఆసుపత్రిలో షాపులు నడపాలంటే మేము ఇచ్చే వాళ్లకు ఇవ్వాలి అనే విధంగా సమాధానం చెబుతున్నారు. ఇకనైనా ఆసుపత్రి లోని దుకాణాల్లో ఎంఆర్పీ ధరలకే వస్తువులు అమ్మే లా ఎంజీఎం సూపరింటెండెంట్ చర్యలు తీసుకోవాలని పేదలు కోరుతున్నారు.