Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెలవు రోజుల్లోనూ పాఠశాలకు..
- కరోనా కాలంలోనూ తరగతులు..
- జన్మనిచ్చిన గ్రామం కోసం ఫౌండేషన్ ఏర్పాటు
నవతెలంగాణ-గూడూరు
వ్యక్తులుగా ఆదర్శ వంతమైన జీవితం గడపడం సహజం. కొందరు మాత్రమే సమాజానికి సైతం ఆదర్శంగా నిలిచేలా భిన్నమైన వృత్తులను మాత్రమే ఎంచుకుంటారు. అంతటితో సంతృప్తి చెందకుండా నిత్య జీవితాన్ని క్రమ పద్ధతిలో నిలుపుకుని సామాజిక సేవలు, కార్యక్రమాలు నిర్వహిస్తూ వృత్తికి సైతం వన్నె తెస్తారు. అలాంటి కోవకు చెందిన వారే ఉపాధ్యాయుడు సోమ రవి. ఆయన జీవితం సమాజానికే ఆదర్శమంటే అతిశయోక్తి లేదు. సెలవుల్లోనూ పాఠశాలకు వెళ్లడం ఆయనకే చెల్లింది. విద్యార్థుల కోసం ఇంకా ఏదైనా చేయాలనే నిరంతర తపన ఆయన సొంతం. 15 ఏండ్లుగా ఉపాధ్యాయుడిగా ఆయన అందిస్తున్న సేవలపై 'నవతెలంగాణ' కథనం..
బాల్యం, విద్యాబ్యాసం
నర్సంపేట మండలంలోని మాదన్నపేటలో సారయ్య-నర్సమ్మ దంపతులకు రవి జన్మించారు. ఆయనది వ్యవసాయ కుటుంబం. ఏకైక కుమారుడు. నాల్గో తరగతి వరకు మాదన్నపేటలోని ఎంపీపీఎస్‌లో, 5 నుంచి పదో తరగతి వరకు అశోక్‌నగర్‌లోని ఏపీఆర్‌ఎస్‌లో అభ్యసించారు. నర్సంపేటలోని కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్, సిద్ధార్థ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
ఉపాధ్యాయ వృత్తిలోకి..
సమాజంలో ఉన్నతమైన జీవితం గడపాలంటే ఉపాధ్యాయ ఉద్యోగమే మార్గమని నవ్మిన సోమ రవి పేద బాలలకు విద్యను అందించడానికి పెద్దపీట వేశారు. 2008లో డీఎస్సీకి ఎంపికై ఏటూరునాగారం లోని ఇప్పలగూడెంలో తొలి పోస్టింగ్ పొందారు. అప్పటికి 40 మంది ఆ పాఠశాలతో పూరి గుడిసెలో నడుస్తుండగా హెచ్ఎంగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన చొరవతో 2014-15 విద్యాసంవత్సరం నాటికి విద్యార్థుల సంఖ్య 72కు చేరింది. అనంతరం నూతన పాఠశాల భవనంలో బోధన చేపట్టారు.
ప్రస్తుతం తాళ్లపాటి తండా స్కూల్లో..
2015లో గూడూరు మండలంలోని తాళ్లపాటి తండాలోని ఎంపీపీఎస్‌కు బదిలీ అయ్యారు. నాడు పాఠశాలలో ఉన్నది కేవలం ఐదుగురు విద్యార్థులు. విద్యార్థుల సంఖ్యను పెంచడానికి అనేక ప్రయత్నాలు చేశారు. 2016-17 విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య జీరోగా నమోదు కావడంతో నాటి ఎంఈఓ చీర భిక్షపతి ఆదేశాల మేరకు తీగలవేణి ఎంపీపీఎస్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. 2018-19 విద్యాసంవత్సరం లో బడిబాటలో భాగంగా పాటిమీదితండా (తాళ్లపాటి తండా) సర్పంచ్ బానోత్ రాధ నర్సింహనాయక్, ఎస్ఎంసీ చైర్మెన్ బాదావత్ చక్రు, గ్రామ పెద్దలు, యూత్ సహకారంతో ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి ఆంగ్ల మాధ్యమంలో బోధన అందించేలా తీర్మానం చేశారు. దీంతో విద్యార్థుల సంఖ్య 19కి చేరింది. నాటి ఎంఈఓ కాంతారావు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం చీర భిక్షపతి పాఠశాలకు డిప్యుటేషన్‌పై మరో ఉపాధ్యాయుడిని నియమించారు.
అభివృద్ధి పథంలో పాఠశాల
సర్పంచ్ బానోత్ రాధ నర్సింహనాయక్ సహకారం తో పాఠశాలకు ఫెన్సింగ్, రూ.5 వేల వేతనంతో ఓ ప్రైవేట్ ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశారు. మొక్కలు నాటించారు. గేటు ఏర్పాటు చేసి స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయుడు రవి మిత్రులైన గ్రామస్తులు మహేందర్, విష్ణు, బోడ రవి ధీరజ్, మల్లునాయక్, సదానందం ఓంజీ, కరన్‌సింగ్, రాజు, విజేందర్, యాకూబ్ పాషా, ప్రభాకర్ సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పాఠశాల గోడలపై పెయింటింగ్ వేయించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం దాతల సహకారంతో ఇంగ్లీష్ మీడియం ప్రింటెడ్ అండ్ రైటింగ్ బుక్స్ అందించారు. ఉచితంగా నోట్‌బుక్స్, పెన్సిల్లు, పెన్నులు, విద్యార్థుల ఫొటో క్యాలెండర్ అందజేశారు. ఏటా విద్యార్థులకు టీ షర్టులు, టైలు, బెల్టులు, ఐడీ కార్డులు ఇస్తున్నారు. ఎన్ఆర్ఐ డి రమేష్ సహకారంతో వాటర్ ప్యూరిఫయర్ ఏర్పాటు చేశారు. కడియం ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, ఇంగ్లీష్ స్టడీ మెటీరియల్, టీ షర్ట్స్ అందించారు. లీడ్ ఫౌండేషన్ సహకారంతో చిల్డ్రన్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. నర్సంపేట స్నేహ హస్తం సహకారంతో విద్యార్థులకు కుర్చీలు సమకూర్చారు. రన్నింగ్ వాటర్ ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. దాతల సహకారంతో ఆటవస్తువులు, సౌండ్ సిస్టం, మ్యాగెట్ బోర్డులు సమకూర్చారు. 2018-19లో విద్యార్థుల సంఖ్య 19 ఉండగా 2019-20లో 34, 2020-21 విద్యార్థుల సంఖ్య 33గా నమోదైంది. విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించేందుకు ఇంగ్లీష్ అండ్ రైటింగ్ బుక్స్ ప్రత్యేకంగా తెప్పించారు.
విద్యార్థుల కోసం కొంత త్యాగం
పాఠశాల సమయాన్ని గంటకుపైగా పెంచు కున్నారు. లోకల్ ఆప్షనల్ హాలీడేస్‌ను వాడుకోవడాన్ని మానేశారు. మూడేండ్లుగా సీఎల్ తీసుకోకుండా పని చేస్తున్నారు. తన వేతనం ద్వారా ప్రొజెక్టర్ కొనుగోలు చేసి విద్యార్థులకు డిజిటల్ తరగతులు బోదిస్తున్నారు. విద్యార్థుల జన్మదిన వేడుకలు నిర్వహించడంతోపాటు బహుమతులు అందిస్తున్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. విద్యార్థులతో బాల సంఘాలు ఏర్పాటు చేసి పాఠశాల అభివృద్ధిలో వారి పాత్రను తెలిపారు. కరోనా సమయం లో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను తక్కువగా వినియోగించి చెట్ల కిందే కరోనా నియమాలు పాటిస్తూ తరగతులు నిర్వహించి వర్క్ షీట్లు ఇచ్చారు. 2020-21 విద్యాసంవత్సరంలో గురుకుల ప్రత్యేక తరగతులు నిర్వహించి 8 మంది విద్యార్థులతో పరీక్ష రాయించి అందరూ అర్హత సాధించేలా చేయడంలో ఘన విజయం సాధించారు. ఆహ్లాదరకమైన వాతావరణంలో టీఎల్ఎంతోనే కాకుండా కత్యాధార బోధన సాగుతోంది.
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
మహబూబాబాద్ విద్యా శాఖ 2020-21 విద్యాసంవత్సరంలో పాఠశాల ప్రగతిని, ఆహ్లాదకర వాతావరణాన్ని, మెరుగైన విద్యాబోధనను గుర్తించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందించింది. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన సోమ రవి పేద విద్యార్థుల కొరకు 2021 డిసెంబర్ 29న స్వగ్రామంలో 'మాదన్నపేట అక్షర ఫౌండేషన్' స్థాపించారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ అండ్ రైటింగ్ బుక్స్, నోట్ బుక్స్ అందజేస్తున్నారు. భవిష్యత్‌లో స్వగ్రామంలో చిల్డ్రన్ లైబ్రరీ ఏర్పాటుతోపాటు, ఉచిత టుటోరియల్ స్థాపించి పేద విద్యార్థులకు అతున్నతమైన విద్యాబోధన అందించాలన్నది కోరికగా సోమ రవి 'నవతెలంగాణ'కు చెప్పారు.