Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మదర్
నవతెలంగాణ-పాలకుర్తి
రజకులకు రక్షణ చట్టం కల్పిం చేందుకు ప్రభుత్వం కృషి చేయాలని రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎదునూరి మదర్ కోరారు. ఆదివారం మండల కేంద్రంలో సంఘం మండల అధ్యక్షుడు చిట్యాల సమ్మయ్య అధ్యక్ష తన ఏర్పాటు చేసిన రజక వృత్తిదారుల సమావేశంలో మదర్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో రజకుల పై పెత్తందారులు కుల వివక్ష, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. వీటి నుంచి రక్షణ కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా రజకులకు రక్షణ చట్టం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 8 సంవత్సరాల కాలంలో రజకులకు బీసీ కార్పొ రేషన్ నుంచి రుణాలు ఇవ్వలేదని ఆరోపించారు. 2018 లో ఎన్నికల ముందు జీవో 190 ప్రకారం రజకుల అందరికీ రూ.2లక్షల రుణం ఇస్తామన్న ప్రభుత్వ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతంలో భూమి లేని రజకులందరికీ మూడెకరాల భూమి ఇవ్వాలని కమ్యూనిటీ హాల్, దోబీ ఘాట్ ల కొరకు గ్రామ పంచాయత్ ద్వారా స్థలాలు కేటాయించాలని కోరారు. 50 ఏండ్లు నిండిన రజక వృత్తిదారులందరికీ ఆసరా పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు. ఉచిత విద్యుత్ పొందుతున్న రజకులందరికీ బీమా పథకం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ ఉపాధ్యక్షుడు జ్యోతి యాదగిరి, కోశాధికారి పొలాల సోమన్న, మచ్చ గుమ్మడి రాజు, శంకరయ్య, లంక శ్రీనివాస్, జ్యోతి, అంజయ్య, వేణు, చిట్యాల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.