Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం
- సంచాలకులు ధరం వీర్ ఝా
నవతెలంగాణ-పాలకుర్తి
ఉపాధి హామీ పనులు ప్రజలకు ఉపయోగపడినప్పుడే సార్ధకత అని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సంచాలకులు ధరమ్ వీర్ ఝా అన్నారు. ఆదివారం మండలంలోని దర్దేపల్లిలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్, ప్రత్యేక అధికారి ప్రసాద్, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్యతో కలిసి గ్రామీణ ప్రాంతంలో చేపట్టిన పనులను ఆయన పర్యవేక్షించారు. రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ శరత్‌తో కలిసి ఆయన మాట్లాడుతూ రోజు వారి కూలీ పనులలో సమయం పెంచుతూ అత్యధికంగా వేతనం వచ్చే విధంగా అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. పల్లె ప్రకతి వనాలకు రూ.256 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు రెండువేల క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని ప్రతి గ్రామపంచాయతీలో కూడా ఏర్పాటు చేయబోతున్నామన్నారు. పల్లె ప్రగతి లో 84 లక్షల బిల్లులు చెల్లింపులు జరిగాయన్నారు. పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని తీర్చిదిద్దాలన్నారు. గతంలో పారిశుద్ధ్య లోపం వల్ల వ్యాధులు వచ్చేవని, ప్రస్తుతం పల్లె ప్రగతితో గ్రామాలు పారిశుధ్యం మెరుగు పరుచుకుంటూ స్వచ్ఛత గ్రామాలుగా నిలిచాయని అన్నారు . రాష్ట్రంలో సుమారు 10 గ్రామ పంచాయతీలు చెత్త సేకరణ ద్వారా రూ.12 లక్షలు సేకరించినట్లు తెలిపారు. గ్రామపంచాయతీలు ఆదాయం పెంచుకోవాలంటే ఇంటింటి తడి, పొడి చెత్త సేకరణ నిరంతరంగా జరగాలన్నారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్ ట్రాలీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపాధి హామీ లో మొక్కలకు నీళ్లు పోయడం ద్వారా ఆదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఆర్డీఏ పీడీ గూడూరు రామ్ రెడ్డి, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండీ మదర్, పంచాయతీ అధికారి రంగాచారి, ఎంపీడీఓ వనపర్తి అశోక్ కుమార్, సర్పంచ్ ఇమ్మడి ప్రకాష్, ఏపీఓ అంబాల మంజుల, ఉపాధిహామీ ఈసీ వాంకుడోత్ రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.