Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 16 మండలాలకు ఇన్ఛార్జీ ఎంఈఓలే..
- 563 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
- నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
నవతెలంగాణ-మహబూబాబాద్
తల్లిదండ్రుల ఉరుకులు.. విద్యార్థులకు పరుగుల నడుమ ఈనెల 13 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. పాఠ్యపుస్తకాలు, యూనిఫారం లేకుండా ఉపాధ్యాయులు ఖాళీలు, అసౌకర్యాలు, శిథిల భవనాల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి తల్లిదండ్రుల గుండెల్లో బడి గంటలు మోగనున్నాయి. పాఠ్యాంశాలు లేకుండా, బ్లాక్ బోర్డ్‌పై రాయకుండా జులై ఫస్ట్ వరకు చదువులు లేకుండానే తరగతులు కొన సాగుతాయి. జిల్లావ్యాప్తంగా 563 ఉపాధ్యాయ ఖాళీలుండగా 16 ఎంఈఓ పోస్టులు కావడం గమనార్హం. 16 మండలాలకు ముగ్గురు ఉపాధ్యాయు లను ఎంఈఓలుగా ఇన్చార్జీ బాధ్యతలతో నియమించిన దుస్థితి నెలకొంది. వారిలో ఒకరిని ఐదు మండలాలకు ఇన్చార్జి ఎంఈఓగా నియమించడం కొసమెరుపు. ఆ ముగ్గురు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులుగా, హెచ్ఎంగా, ఎంఈఓగా బాధ్యతలు నిర్వర్తించాలి. జిల్లావ్యాప్తంగా పాఠ్యపుస్తకాలు అందుబాటులో లేవు. విద్యార్థులకు యూనిఫారం రాలేదు. జిల్లావ్యాప్తంగా 316 పాఠశాలలను 'మన ఊరు-మన బడి'కి ఎంపిక చేసినా పనులు ప్రారంభించలేదు. పాఠశాలల్లో వంట గదులు, ఫర్నీచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ, క్రీడామైదానం, గ్రంథాలయం, తదితర సౌకర్యాలు లేవు. కాగా ప్రభుత్వం ఈ ఏడాది ఒకటి నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ విద్యాబోధనను ప్రవేశ పెట్టనుంది. ఈ క్రమంలో అదనంగా ఉపాధ్యాయులు అవసరం. జిల్లావ్యాప్తంగా 3698 మంది ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా 3133 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. మిగతా 563 మంది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి ప్రత్యేక ఉపాధ్యాయులను కేటాయించలేదు. జిల్లాలో లక్షా 6 వేల 636 మంది విద్యార్థులుండగా వారిలో 25 వేల 590 మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. మరో 81 వేల 41 మంది ప్రభుత్వ పాఠశాలలకు వెళ్తారు. జిల్లాలో శ్రీదేవి అనే ఉపాధ్యాయురాలికి కొత్తగూడ, గంగారం, కేసముద్రం, గూడూరు ఎంఈఓ బాధ్యతలు అప్పగించారు. రాము అనే ఉపాధ్యాయుడికి తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల బాధ్యతలు అప్పగించారు. అలాగే రాము అనే మరో ఉపాధ్యాయుడికి మహబూబాబాద్, కురవి, డోర్నకల్, మరిపెడ, గార్ల, బయ్యారం, చిన్నగూడూరు మండలాల బాధ్యతలు కట్టబెట్టారు. జిల్లావ్యాప్తంగా కోటి 67 లక్షల పుస్తకాలు అవసరం ఉండగా ఇంతవరకు ఒక పుస్తకం కూడా జిల్లా కేంద్రానికి చేరలేదు. పుస్తకాలు ముద్రితమై జిల్లా కేంద్రానికి, తర్వాత పాఠశాలకు చేరడానికి 20 రోజులు పట్టే అవకాశమున్న క్రమంలో అప్పటి వరకు 'మన ఊరు-మన బడి' సంసిద్ధత కార్యక్రమాలు చేపట్టనున్నారు. 13న పాఠశాలల ప్రారంభం, 14న ఆంగ్ల మాధ్యమ బోధనపై అవగాహన, 15న తల్లిదండ్రుల సమావేశం, 16న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం, 18న బాలిక విద్య, 19న కెరీర్ గైడెన్స్, 20న సామూహిక అక్షరాభ్యాసం, 21న స్వచ్ఛభారత్, 22న హరితహారం, 23న ప్రత్యేక అవసరాల పిల్లల చేరిక, 24న బాలసభ, 25న గ్రంథాలయ నిర్వహణ, 27న బడి మానేసిన బాలలను చేర్పించడం జరుగుతాయి. అలాగే 28న ఆంగ్ల, 29న తెలుగు మాధ్యమాలపై డిజిటల్ ఎడ్యుకేషన్, 30న గణితం, సైన్స్ డే నిర్వహిస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాల విద్యపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఓపక్క ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాలు, యూనిఫారం, బ్యాగులు, షూ, ఇతరత్రా విక్రయాలంటూ హడావుడి చేస్తుండగా వాటి కొనుగోలు కోసం తల్లిదండ్రుల గుండెలు గుబెల్లుమంటున్నాయి. పెరిగిన ధరలతో విద్యార్థులను పాఠశాలకు ఎలా పంపించాలని అయోమయానికి తల్లిదండ్రులు గురవుతున్నారు.
తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలి
ఎస్ మల్లారెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి
జిల్లాలోని ఉపాధ్యాయ ఖాళీల్లో వెంటనే తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే ఉపాధ్యాయులను నియమించే వరకు విద్యా వాలంటీర్లు నియమించాలి. ఉపాధ్యాయులకు ఉద్యోగోన్నతులు కల్పించకపోవడంతో హైస్కూళ్లలో భాషా పండితుల, స్కూల్ అసిస్టెంట్ల కొరత ఏర్పడింది. సబ్జెక్టుఉపాధ్యాయులు లేరు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే సకాలంలో ఉపాధ్యాయులను నియమించి పాఠ్యపుస్తకాలతోపాటు యూనిఫారం అందించాలి. పాఠశాలల అభివద్ధికి తక్షణమే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలి.