Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యకాస, కేవీపీఎస్ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ-లింగాలఘణపురం
నెల్లుట్ల రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 464, 465 ల్లో గల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని వ్యకాస జిల్లా కార్యదర్శి ఎదునూరి వెంకట్రాజం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయం ఎదుట ఆ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రాజం, శేఖర్ మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన వాగ్ధానాల్లో ఇండ్ల స్థలాలు ముఖ్యమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కరికి కూడా భూమి ఇవ్వలేదని విమర్శించారు. పేదలకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు, దళితులకు భూపంపిణీ బుట్ట దాఖలయ్యాయని చెప్పారు. విలువైన ప్రభుత్వ భూములను భూస్వాములు, పెత్తందార్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ పలుకుబడి కలిగిన ప్రజాప్రతినిధులు ఆక్రమిస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. జనగామ పట్టణానికి సమీపంలోని గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కబ్జా నుంచి కాపాడి పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆ సంఘాల జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్, తూటి దేవదానం, జిల్లా నాయకులు పొత్కనూరి ఉపేందర్, మండల నాయకులు గోసంగి శంకరయ్య, చెన్నూరు ఉప్పలయ్య, మబ్బు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.