Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రఘునాథపల్లి
మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ఖిలాషాపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను అదే టీఆర్ఎస్కు చెందిన కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడం పట్ల మండలంలో చర్చనీయంగా మారింది. ఫ్లెక్సీల గొడవతో టీఆర్ఎస్లో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ లో తమ నాయకుని ఫ్లెక్సీఫోటోలు లేదనే కారణంతో ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. దీంతో సదరు జన్మదిన వేడుకలు జరుపుకునే వ్యక్తి టీఆర్ఎస్ కార్యాలయం వద్దకు చేరుకొని చూడగా అప్పటికే ఆ ఫ్లెక్సీలు ధ్వంసమై ఉన్నాయి. దీంతో ఎవరు చేశారనే కోణంలో ఆయన ఆరా తీయగా సొంతగూటికి చెందినవారే ధ్వంసం చేయడం పట్ల ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు తలెత్తాయి. దీంతో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. విషయం తెలుసుకున్న ఉన్నతస్థాయి నాయకులకు ఈ ఘటన తలనొప్పిగా మారింది. అసలే రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో మండల స్థాయిలో ఒకే పార్టీలో ఉంటూ వర్గ పోరు కు దారితీసేలా చర్యలకు పాల్పడడంతో టీఆర్ఎస్ గమ్యం ఎటు వైపు అనే కోణంలో పార్టీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రతిపక్ష నాయకులు వారిని పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఫ్లెక్సీల గోల దేనికి దారితీస్తుందో వేచి చూడాలి.