Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
- భూపాలపల్లిలో నిరసన
నవతెలంగాణ-భూపాలపల్లి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'అగ్నిపథ్' స్కీమ్‌ను తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శుక్రవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాయిలు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం త్రివిధ దళాల్లోకి రిక్రూట్మెంట్ కోసం తీసుకొచ్చిన 'అగ్నిపథ్' పథకం యువతను నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. దేశ భద్రతకు సైతం నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారు. సుమారు ఆర్నెళ్లుగా అనేక వ్యయ ప్రయాసలకోర్చి శిక్షణ తీసుకున్న యువతను 4 ఏండ్ల తర్వాత తొలగించేలా స్కీమ్‌లో పొందుపర్చడం దుర్మార్గమన్నారు. కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాన్ని విడనాడి రెగ్యూలర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పొలం రాజేందర్, రమేష్, రాజన్న, కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు రాజన్న, శ్రీకాంత్, వినరు, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపథ్' పథకాన్ని రద్దు చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దొగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్ ఆధ్వర్యంలో హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు. అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయని చెప్పారు. నాలుగేండ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదని తెలిపారు. పింఛన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం పథకం తేవడమంటే వత్తిపరమైన సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై తీవ్రంగా రాజీపడడమేనని అన్నారు. రెండేళ్లుగా భారత సైన్యంలో రిక్రూట్మెంట్ లేదని గుర్తు చేశారు. సాయుధ బలగాల్లోకి రెగ్యులర్ సైనికులను రిక్రూట్ చేసుకోవడానికి బదులు అగ్నిపథ్‌ను తీసుకురావడం సరికాదన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు మోతె సతీష్, కంచర్ల కుమారస్వామి, దేవకి, పల్లకొండ శ్రీకాంత్, దాసరి నరేష్, శ్వేత అయోష, ఆశా శిరీష, రాధిక, తదితరులు పాల్గొన్నారు.
'అగ్నిపథ్'ను రద్దు చేయాలి : సీపీఐ
హనుమకొండ : కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'అగ్నిపధ్' పథకాన్ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు డిమాండ్ చేశారు. హనుమకొండలోని ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల కాలానికి కాంట్రాక్టు ప్రాతిపదికన సైనికులను రిక్రూట్ చేయడం వల్ల వత్తి నైపుణ్యాలతో కూడిన సాయుధ బలగాల సామర్ధ్యాన్ని పెంచడం సాధ్యం కాదన్నారు. పెన్షన్ డబ్బును ఆదా చేసుకోవడం కోసం పథకం తేవడాన్ని సాయుధ దళాల నైపుణ్యం, సామర్ధ్యంపై రాజీపడడంగా అభివర్ణించారు. కాంట్రాక్టు సైనికులుగా పని చేస్తే నాలుగేండ్ల సర్వీసు తర్వాత ఉపాధి అవకాశాలు లేకుండా మిగిలిపోతారని ఆందోళన వెలిబుచ్చారు. ఉపాధి భద్రతకు కనీస రక్షణ కూడా లేకుండానే అత్యున్నత త్యాగాలు చేయడానికి సిద్ధపడాలంటూ యువతకు ప్రధాని పిలుపునివ్వడాన్ని నేరపూరితమన్నారు. అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి సాయుధ బలగాల రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కర్రి భిక్షపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు మండ సదాలక్ష్మి, మద్దెల ఏల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
'అగ్నిపథ్'ను రద్దు చేయాలి : లిబరేషన్
పాలకుర్తి : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల కార్యదర్శి జీడి సోమయ్య అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రమేష్ రాజా మాట్లాడారు. ఆర్మీలో సైనికులను కాంట్రాక్టు పద్ధతిలో రిక్రూట్మెంట్ చేయడం వల్ల సాయుధ బలగాల సామర్ధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. మృతుడి కుటుంబానికి రూ.40 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి మాన్యపు భుజేందర్, ఐప్వా జిల్లా కార్యదర్శి అనంతోజు రజిత, ఆర్వైఏ జిల్లా కన్వీనర్ దుస్సా శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.