Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం
- మద్దతుకు మించి పెరిగిన ధరలే కారణం
- అందుబాటులో విత్తనాలు, ఎరువులు
- 'తొలకరి' కోసం అన్నదాత ఎదురుచూపులు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాల్లో గతేడాది వానాకాలంలో 2 లక్షల 56 వేల 639 ఎకరాలు సాగు చేయగా ఈ ఏడాది సుమారు 2 లక్షల 73 వేల 221 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుకు జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పత్తి, మిర్చి, వరి, పసుపుతోపాటు ఈ ఏడాది చిరుధాన్యాల సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
పత్తి పంటకే ప్రాధాన్యత...
జిల్లాలో రైతులు పత్తి పంటకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతేడాది 89 వేల 729 ఎకరాల్లో పత్తి పంటలు సాగు చేశారు. ఈ ఏడాది లక్షా 18 వేల 6 వందల ఎకరాల్లో సాగుకు అధికారులు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా విత్తనాల ప్యాకెట్లను డీలర్ల దగ్గర అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది మిర్చితోపాటు పత్తికి ఎన్నడూ లేని విధంగా అధిక ధర పలికింది. పెద్ద మొత్తంలో లాభాలు రాకపోయినా పెట్టుబడి మాత్రం వస్తుందన్న ఆశతో రైతులు ఈ పంటపై ఆసక్తి చూపుతున్నారు.
అంచనాలకు మించి ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు హెచ్చుతగ్గుల కారణంగా పత్తి పంటకు ధరలు ఉండవని ప్రచారం జరిగినా గతేడాది పత్తి పంట ధరలు అంచనాలకు మించి రూ.10-12 వేల వరకు పలికిన విషయం తెలిసిందే. పంట చేతికొచ్చినప్పటి నుంచి కొనుగోళ్లు ముగిసే వరకు మద్దతు ధర లభించింది. ఈసారి కూడా రైతులు పత్తి పంటపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పత్తి పంట సాగు చేస్తే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి ఉండేదన్న భావన గతేడాది నష్టపోయిన రైతుల్లో ఉంది. గత అనుభవంతోనే ఈసారి పత్తి పంటను సాగు చేసేందుకు రైతులు అధికంగా మొగ్గుచూపుతున్నారు. దీంతో ఖరీఫ్‌లో జిల్లాలో 22 వేల ఎకరాలలో పత్తి పంట సాగు విస్తీర్ణం పెరిగిందని అధికారిక లెక్కలు చెబు తున్నాయి. ప్రస్తుతం రైతులు విత్తనాలను కొనుగోలు చేసి తొలకరి వర్షం కోసం ఎదురు చూస్తున్నారు.
వెంటాడుతున్న 'గులాబీ' గుబులు..
జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతుల్లో గులాబీ పురుగు గుబులు పుట్టిస్తోంది. కొన్నేండ్లుగా గులాబీ రంగు పురుగు వెంటాడుతోందన్న ఆందోళన ఉంది. ఈ పురుగు ఉధతితో పంట నష్టం వాటిల్లుతుంది. అయినా రైతులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. పత్తికి వాతావరణం అనుకూలంగా ఉండడంతోపాటు నల్లరేగడి భూములు అధిక దిగుబడులు రావడం అసలు కారణమని రైతులు చెబుతున్నారు. అధికారులు మాత్రం మిశ్రమ పంటలను సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. రైతులు స్వయంగా సాగు చేసిన అనుభవంతోనే ముందుకు సాగుతున్నారు. అధిక దిగుబడులు వస్తాయని రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే ధరలు బాగానే ఉన్నాపెట్టుబడి ఖర్చులు మరింతగా పెరిగిపోవడంతో లాభాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయని రైతులు వాపోతున్నారు.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
జిల్లాలో 2 లక్షల 73 వేల 220 ఎకరాల సాగుకు గాను 40 వేల 223 టన్నుల యూరియాతోపాటు 12 వేల 276 టన్నుల డీఏపీ, 12 వేల 276 టన్నుల కాంప్లెక్స్ ఎరువులతోపాటు 6 వేల 595 టన్నుల ఫొటాష్ అవసరమని అధికారులు అంచనా వేశారు. అలాగే 25 వేల 791 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా 17 వేల 229 క్వింటాళ్లు రైతుల వద్ద ఉన్నాయి. ఇంకా 15 వేల 562 క్వింటాళ్లు అవసరం ఉన్నాయి. విత్తనాలు సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు.
పత్తి పంట సాగు మేలు : సల్ల రవీందర్, యువ రైతు పెద్దాపూర్
గతేడాది పత్తికి మద్దతు ధర ఉండడంతో ఈసారి కూడా పత్తి పంట సాగు చేయాలనుకుంటున్నాను. ప్రభుత్వం చెప్పినట్టుగా పంటలను సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయని ఆశించి మోసపోయాం. ఈ క్రమంలోనే ఈసారి అధికంగా పత్తి పంట సాగు చేస్తున్నా. ఎకరానికి రెండు బ్యాగులు కొనుగోలు చేశా. ఈసారి కూడా రైతుల పంట పండినట్టే. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే కష్టాలు దూరమవుతాయి. గులాబీ పురుగు నివారణ కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.
అదును చూసి విత్తుకోవాలి : విజయ భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి
పత్తి పంటలు సాగు చేసే రైతులు అదును చూసి విత్తనా లను విత్తుకోవాలి. నేలల్లో సరైన తేమ శాతం ఉంటేనే విత్తనాలు సరిగ్గా మొలకెత్తు తాయి. కొందరు రైతులు తొల కరి వర్షానికి తొందరపాటుగా విత్తనాలు విత్తుకొని నష్టపోతారు. విత్తన ఎంపిక కూడా ప్రధానమే. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. లైసెన్స్ ఉన్న షాప్‌ల్లో మాత్రమే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేయాలి. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలి.