Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం
నవతెలంగాణ-మహబూబాబాద్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడిసెవాసులపై దమనకాండ ఆపివేసి, పడావుగా ఉన్న ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు నిరుపేదలకు ఇండ్ల స్థలాలకు సాగుకు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న డిమాండ్ చేశారు. సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెరుమాండ్ల జగన్నాథం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాణాల రాజన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వీరయ్య పాల్గొని మాట్లాడుతూ.. ఎనిమిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ప్రకారం ఇండ్లు వస్తాయని ఎదురు చూసి పేదలు విసిగివేసారిపోయారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో వ్యవసాయ, అసంఘటిత, వలస కార్మికులు, ఇతర పేదలు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారిపై దాడి చేసి గుడిసెలు కాల బెట్టి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ నాయకులు, భూస్వాములు దర్జాగా భూమిని ఆక్రమించుకుంటే వత్తాసు పలుకుతూ పేదలపై దమనకాండ సాగించడం తగదన్నారు. రాష్ట్రంలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని జీఓ-58 ప్రకారం నిరుపేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. పోడు సాగుదారులపై నిర్బంధం ఆపి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు మూడెకరాల భూమి, దళితబంధు ఒకేసారి రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు వై కిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయి కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి యాకోబు జిల్లా నాయకులు పెరమండ్ల తిలక్బాబు, డి హేమనాయక్, చింతల బిక్షపతి, చేపూరి గణేష్, గొడిశాల వెంకన్న, బ్రహ్మచారి, మన్సూర్, తదితరులు పాల్గొన్నారు.