Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవంగర
మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం మంగళవారం నిర్వహించిన గ్రామ సభ రసాభాసగా ముగిసింది. సర్పంచ్ వెనుకదాసుల లక్ష్మి రామచంద్రయ్య శర్మ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి తహశీల్దార్ రమేష్ బాబు, ఎంపీపీ ఈదురు రాజేశ్వరి హాజరయ్యారు. తహశీల్దార్ దరఖాస్తుదారుల జాబితాను చదువుతున్న క్రమంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో మొదటి విడతలో జనరల్ కేటగిరీలో 50 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నాలుగేళ్ల క్రితం నాణ్యత లేమితో నిర్మాణం చేపట్టడంతో అప్పుడే శిథిలావస్థకు చేరాయి. మూడో దశలో ఎస్సీల కొరకు ప్రత్యేకంగా 30 ఇళ్లను కేటాయించారు. ఇవి నిర్మాణం దశలో ఉన్నాయి. మొత్తం 80 ఇండ్లకు ఎస్సీ లకు 40 కేటాయించినట్లు తెలపడంతో అధికారులను ఎస్సీలు నిలదీశారు. ఎస్సీలకు 55 ఇండ్లు రావాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. ముందుగా మూడెకరాల భూమిని అనర్హులకు కేటాయించారని, ఆ సమస్యను పరిష్కరించాలన్నారు. ఆ తర్వాతే రిజర్వేషన్ ఆధారంగా అర్హులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలన్నారు. గందరగోళం నెలకొనడంతో గ్రామ సభను అధికారులు వాయిదా వేశారు. ఈ సందర్భంగా తహశీల్దార్, ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులను ఎంపిక ప్రక్రియను చేపడుతామన్నారు. పేదలకు న్యాయం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాస్, ఉప సర్పంచ్ శ్రీరామ్ రాము, ఆర్ఐ భూక్య లష్కర్, కార్యదర్శి వెంకన్న, నాయకులు శ్రీరామ్ సుధీర్, లింగమూర్తి, శ్రీనివాస్, యాకయ్య, బిక్షపతి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.