Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -జనగామ
పట్టణంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మూడవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల స్థలాలలో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జనగామ పట్టణం బాణాపురంలో మూడవ విడత ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ సభ్యురాలు ఎండీ గౌసియా అధ్యక్షతన మూడవ విడత ఇందిరమ్మ డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని అన్నారు. 2012-13లో జనగామ పట్టణంలో మూడవ విడతలో 1167 మందికి గత ప్రభుత్వం ఇండ్ల స్థలాల పట్టాలిచ్చారని తెలిపారు. ఎనిమిది సంవత్సరాలు గడిచిన ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణంకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం లబ్ధిదారుల స్థలాలను ఆక్రమించుకోవడంతో లబ్ధిదారులు కోర్టును ఆశ్రమించడంతో ప్రభుత్వం దిగొచ్చి 560 మంది లబ్ధిదారులకు డబల్ బెడ్రూమ్ ఇండ్లను సంవత్సరంలో పూర్తిచేసి అప్పగిస్తామని చెప్పి నేటికీ నాలుగేండ్లైందని, ఇప్పటికి 250 డబల్ బెడ్రూమ్ ఇండ్లను మాత్రమే ప్రారంభించారన్నారు. కాంట్రాక్టర్ నాణ్యతాప్రమాణాలు పాటించడంలేదని ఆరోపించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పగుళ్లు, పర్రెలు, పెచ్చులు ఊడిపోవడం, నిర్మించిన గోడల ఇటుకలు పడిపో తున్నాయన్నారు. నాణ్యత తో నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించి త్వరితగతిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు బి. చందూనాయక్, మూడవ విడత ఇండ్ల సాధన కమిటీ నాయకులు కల్యాణ లింగం, పొన్నాల ఉమ, నజియా, శాంత, కమల, బాబూరావ్ తదితరులు పాల్గొన్నారు.