Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి 27 నుంచి ఉద్యమాలు
- జూలై 1న డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పేరిట దోపిడీ జరుగుతుండగా చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వక్తలు విమర్శించారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో హనుమకొండలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మంద సంపత్ అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులతో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీకి అంతులేకుండా పోతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఫీజులను నియంత్రించకపోగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తోందని విమర్శించారు. ఇప్పటికే కరోనా కారణంగా పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక, కనీస వేతనాలు అందక ఇబ్బందులు పడుతుండగా పిల్లల చదువుల కోసం అప్పు చేసి తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 2016లో ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ కోసం వేసిన తిరుపతిరావు కమిటీ 2018లో సూచనలు చేసినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తిరుపతిరావు కమిటీ సిఫార్సులను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యజమానులు విచ్చలవిడిగా ఫీజుల పేరిట దోపిడీ చేస్తున్నారని తెలిపారు. పాఠశాలలను వ్యాపార సంస్థలుగా మార్చి కోట్లాది రూపాయలు దండుకున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజుల దోపిడిని అరికట్టకపోతే ఐక్యపోరాటాలు తప్పవని హెచ్చరించారు. ఈనెల 27 నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడతామని, జూలై 1న డీఈఓ కార్యాలయం ఎదుట దర్నా చేస్తామని చెప్పారు. సమావేశంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి వీరన్న, అధ్యక్షుడు భానునాయక్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు సాంబయ్య, రైతు సంఘం జిల్లా నాయకుడు చుక్కయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు టి ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు.