Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2.98 లక్షల నకిలీ నోట్ల స్వాధీనం : ఎస్పీ
నవతెలంగాణ-భూపాలపల్లి
దొంగనోట్లు చెలామణి చేస్తున్న ముగురిని మహదేవ్పూర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సురేందర్‌రెడ్డి వెల్లడించారు. మహాదేవపూర్ మండల బెగుళూరు గ్రామానికి చెందిన పోలు సతీష్ అదే గ్రామానికి చెందిన ఎలుకూచి సురేష్‌తో కలిసి దొంగ నోట్ల వ్యాపారం చేసేందుకు నిర్ణయించుకొని ఇద్దరు కలిసి 10 రోజుల క్రితం మహారాష్ట్రలోని సిరోంచకు చెందిన జయంత్‌ను కలిసి మాట్లాడారు. సతీష్, సురేష్లను జయంత్ అకోలాకు తీసుకెళ్లాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ముగ్గురూ రూ.50 వేల అసలు నోట్లు ఇస్తే బదులుగా రూ.3 లక్షల రూపాయలు దొంగనోట్లను ఇసామనగా ఒప్పుకుని రూ.3 లక్షలను తీసుకుని నోట్ల మార్పిడి కోసం బయల్దేరారు. దారిలో రూ.1700లు ఖర్చు చేశారు. మిగిలిన దొంగనోట్లను ముగ్గురు పంచుకున్నారు. సతీష్ వద్ద ఒక లక్ష 20 వేల రూపాయలు, జయంత్ వద్ధ లక్ష 10 వేల రూపాయలు, సురేష్ వద్ద రూ.68 వేల 300లు ఉంచుకుని ఇండ్లలో దాచుకున్నారు. వాటిని మళ్లీ మహారాష్ట్ర లోనే చెలామణీ చేద్దామని నిర్ణయించుకుని 24న సతీష్ యొక్క కారులో మహారాష్ట్రకు వెళుతుండగా మార్గమద్యలో కుదురుపల్లి క్రాస్ రోడ్డు దగ్గరకు చేరగా అక్కడ చేపట్టిన పోలీసుల తనిఖీలో పట్టుబడ్డారు. పోలీసులు వారి నుంచి దొంగ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మొత్తం రూ.200ల నోట్ల కట్టలు ఐదు, రూ.500ల కట్టలు రెండు ఉన్నట్టు వెల్లడించారు. చాకచక్యంగా నిందితులను పట్టుకున్న మహదేవ్పూర్ సీఐ కిరణ్, ఎస్సై రాజ్‌కుమార్, సిబ్బందిని ఎస్పీ సురేందర్‌రెడ్డి అభినందించారు.