Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరిపడా లేని వైద్య సిబ్బంది
- ఒక్క వైద్యుడితోనే సేవలు..
- డిప్యుటేషన్‌పై వచ్చిపోతున్న ఫార్మసిస్ట్ రోగులకు తప్పని ఇక్కట్లు
- ఎన్హెచ్ఆర్సీ సిబ్బంది వస్తున్నారని హడావిడి
నవతెలంగాణ- దంతాలపల్లి
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. కానీ, దంతాలపల్లి పీహెచ్సీలో మాత్రం సిబ్బంది లేమి, అధికారుల నిర్లక్ష్యంతో రోగులు ఇబ్బందుల పాలవుతున్నారు. గంటల తరబడి వేచి చూసినా వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు చేసేదేమిలేక ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం పట్టించుకోని దుస్థితి నెలకొంది. పీహెచ్‌సీపై పర్యవేక్షణ కొరవడడంతో వైద్య సిబ్బంది కూడా సమయపాలన పాటించట్లేదనే విమర్శలొస్తు న్నాయి. దీనికి తోడు మౌలిక వసతులు కల్పించకపో వడంతో రోగులు నానా తంటాలు పడుతున్నారు. నర్సింహులమండలం, దంతాలపల్లి మండలాలకు కలిపి ఒకటే పీహెచ్సీ దంతాపల్లిలో ఉంది. మొత్తంగా 39గ్రామపంచాయతీలతోపాటు శివారు తండాలకు ఇదే పీహెచ్సీ దిక్కు. మొత్తం 12 సబ్ సెంటర్లు ఉండగా 6 సెంటర్లకు ఆరుగురు ఏఎన్ఎంలు లేరు. ఒక ల్యాబ్ టెక్నీషియన్, మేల్ వార్డుకు సంబంధించి ఐదుగురుకి గాను ఇద్దరు హెల్త్ అసిస్టెంట్లతోపాటు స్టాఫ్ నర్స్ లేదు. ఉన్న ఒక్క ఫార్మసిస్ట్ డిప్యూటేషన్‌పై వచ్చి పోతుంటారు. ఈ ఆస్పత్రికి నిత్యం 80నుంచి 100మంది దాకా ఓపీ పేషంట్లు వస్తుంటారు. కానీ, ఒక్కడే వైద్యుడు ఉండడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇద్దరు వైద్యులు ఉండగా మరొకరు పై చదువుల నిమిత్తం వెళ్లినట్టు సమాచారం. పీహెచ్‌సీకి వచ్చిన రోగులకు తాగునీటి పాట్లు తప్పడం లేదు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మినీ వాటర్ ట్యాంక్ కొన్ని రోజులుగా నిరుపయోగంగా దర్శనమిస్తోంది. వైద్య సిబ్బందికి గదిలో ప్రత్యేకంగా వాటర్ ఫిల్టర్ ఉంది. ఇందులోకి బోరు బావి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఇక్కడే బాటిళ్లలో నీరు పట్టుకుని సిబ్బంది దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇక రోగులు మాత్రం వాటర్‌బాటిళ్లు బయట కొనుక్కొని తాగాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు జ్వరం టాబ్లెట్లు కూడా ఇవ్వని పరిస్థితిలో ఫార్మసిస్ట్‌లు ఉన్నారు. ఆసుపత్రికి కి వైద్యం కోసం వచ్చిన రోగులకు ఆస్పత్రిలో బెడ్ పై కుక్కలు కనిపించడంతో భయాందోళనలకు గురవుతున్నారు. అంటే కనీస పర్యవేక్షణ కూడా లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. పీహెచ్‌సీకి వచ్చిన పేద రోగులు గంటల సమయం వెచ్చించినా వైద్యం అందని ద్రాక్షలా మారుతోంది. కాగా ఎన్హెచ్ఆర్సీ సెంట్రల్ టీం వస్తుందని తెలియడంతో ఆస్పత్రిలో అద్దె మొక్కలు, అద్దె ట్రీ గార్డ్ లతో ఆదివారం హడావుడి చేశారు. ఉన్నతాధికారులు వచ్చినపుడే హడావుడి చేయకుండా ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి నర్సింహులపేట మండల ప్రజలు కోరుతున్నారు.
మందులు లేవని పంపిస్తున్నారు
మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వెళ్లే సంబంధిత మందులు లేవని పంపిస్తున్నారు. చేసేదేమీ లేక ప్రయివేటులో కొనుక్కుంటున్నాం. ఉన్నతాధికారులు స్పందించి ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూడాలి.
- మాలోతు లాలు, మెగ్యాతండవాసి
రోగులకు సౌకర్యాలు కల్పించాలి
ఆస్పత్రికొచ్చే రోగులకు కనీసం తాగునీరు కూడా లభించడం లేదు. పర్యవేక్షణ లోపంతో సమస్యలు తలెత్తుతున్నాయి. కుక్కలు ఆస్పత్రిలోకొచ్చి బెడ్లపై ఉంటున్నా పట్టించుకోని దుస్థితి నెలకొంది. సరిపడా సిబ్బంది లేక వైద్యం సరిగా అందడం లేదు. పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించి పేద రోగులకు వైద్యం అందించాలి.
- మాలోతు రాజు
పేదలకు మెరుగైన వైద్యం అందించాలి
వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ఈక్రమంలో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుంది. సౌకర్యాలు కల్పించకుంటే అనేక సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే సరిపడా వైద్యసిబ్బంది లేరు. అధికారుల పర్యవేక్షణ కూడా కరువైంది. జిల్లా వైద్యాధికారులు స్పందించి ఆస్పత్రిలో అన్ని సౌకర్యాలు కల్పించి, సిబ్బందిని నియమించి సమస్యలు పరిష్కరించాలి.
- సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బండి శ్రీనివాస్