Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లంపల్లి రహదారిపై కనిపించిన వైనం
- అటవీ ప్రజల బెంబేలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎఫ్డీఓ కృష్ణ ప్రసాద్
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచరిస్తోంది. శనివారం రాత్రి భూపాలపల్లి అడవుల్లో పులి కనిపించింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మంచిర్యాల నుంచి భూపాలపల్లికి వస్తుండగా రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో కమలాపూర్-మల్లంపల్లి బాంబుల గడ్డ నడుమ అటవీ ప్రాంతంలోని జాతీయ రహదారి దాటుతూ పులి మల్హర్రావు మండలం అడవుల వైపు వెళ్లింది. దీంతో డ్రైవర్ రమేష్ ఒక్కసారిగా బస్సును నిలిపేశాడు. బస్సులోని ప్రయాణికులు సైతం పులిని చూశారు. ఒక్కసారిగా పులి కనిపించేసరికి బెంబేలెత్తినట్టు బస్సులో ప్రయాణించిన సింగరేణి కార్మికుడు అంకిరెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే ఆదివారం ఉదయం భూపాలపల్లి సింగరేణి వన్ ఇంక్లైన్ బొగ్గు బావి వద్ద పులి కనిపించినట్లు కార్మికులు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రదేశానికి చేరుకొని విచారణ చేపట్టారు.
గతేడాది..
గతేడాది నవంబర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాతోపాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో పులి సంచరించిన విషయం తెలిసిందే. మళ్లీ శనివారం రాత్రి భూపాలపల్లి అడవుల్లో పులి కనిపించింది. కొన్ని నెలల క్రితం వచ్చిన పులి మళ్లీ వచ్చిందా? లేక వేరే పులి సంచరిస్తోందా? అనే కోణంలో పులి పాదముద్రల ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. పులి సంచరిస్తున్న విషయం తెలిసి బాంబులగడ్డ, గడ్డిగానిపల్లి, సిగ్గంపల్లి, కాసింపల్లి, కమలాపూర్, మలహల్రావు మండలంలోని మల్లంపల్లి తూముల ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలు
భూపాలపల్లి, మల్హర్ మండలాల్లో పులి సంచరించినట్లుగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలోని భూపాలపల్లి సింగరేణి వన్ ఇంక్లైన్ బొగ్గు బావి సమీప అడవులతోపాటు మల్హర్ మండలంలోకి తూముల అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి పులి సంచరించినట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారంతో ఎఫ్డీఓ కృష్ణప్రసాద్ నేతత్వంలో ఎఫ్ఆర్ఓ నరేష్ ఆధ్వర్యంలో డీఆర్వో ఝాన్సీ, బీట్ ఆఫీసర్లు ప్రశాంత్, ఇబ్రహీమ్, భాస్కర్లతోపాటు బేస్ క్యాంప్ సిబ్బందితో ఆదివారం ఉదయం భూపాలపల్లి వన్ ఇంక్లైన్ బొగ్గు బావి వద్ద పులి సంచరించిన స్థలానికి చేరుకొని పులి పాదముద్రలను గుర్తించి కొలతలు తీశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కృష్ణ ప్రసాద్, ఎఫ్డీఓ, భూపాలపల్లి
జిల్లాలోని అడవుల్లో పులి తిరుగుతున్నట్లు నిర్ధారణకు వచ్చాం. పాదముద్రలను గుర్తించాం. అయితే ఆది గతంలో వచ్చిన పులా? లేక వేరే పులా, ఆడా? మగా? తేలాల్సి ఉంది. అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పశువుల కాపరులు, పొయ్యిల కట్టెల కోసం వెళ్లే ప్రజలు అటవీ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ఐదు రోజుల వరకు అడవుల్లోకి వెళ్లవద్దు. ఈ విషయమై ఇప్పటికే సమీప గ్రామాల సర్పంచ్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశాము.