Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
పాఠశాల సమయానికి ఆర్టీసీ బస్సును నడపా లని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ-2 డిపో మేనేజర్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గతంలో మాదిరిగా హనుమకొండ నుంచి ఉదయం 6.30 గంటలకు ఆర్టీసీ బస్సును మంగపేట వరకు నడపాలని, సాయంత్రం 5.15కు ఏటూరునాగారం నుంచి హనుమకొండకు వెళ్లే ఆర్టీసీ బస్సును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో హనుమకొండ, ములుగు నుంచి మండలంలోని వివిధ పాఠశాలలకు వచ్చే టీచర్లు బస్సులు సకాలంలో నడవక ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. చిన్నబోయినపల్లి నుంచి శివపూర్ మీదుగా శాపల్లి, కొండాయి గ్రామాల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు ఏటూరునాగారంలోని జెడ్పీ స్కూల్కు వచ్చే వారని తెలిపారు. బస్సు ఛార్జీలు పెంచినా ఆదాయము సరిపోవడం లేదనే సాకుతో వరంగల్-2 డిపో మేనేజర్ బస్సు సర్వీసును రద్దు చేయడం సరికాదన్నారు. చెల్పాక, ఆకులవారి ఘనపురం గ్రామాలకు పంచాయతీలకు సైతం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పారు. రొయ్యూరు, శంకరాజుపల్లి, తదితర గ్రామాల ప్రజలు, విద్యార్థులు బస్సు సౌకర్యం లేక ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. డీఎం స్పందించి బస్సులను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అనుకూలమైన సమయాల్లో నడపని పక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, ఉపసర్పంచ్ కర్ల అరుణ కిరణ్, మాజీ మండల అధ్యక్షుడు వావిలాల నర్సింహారావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, మండల ఉపాధ్యక్షుడు రియాజ్ గియా, యూత్ మండల అధ్యక్షుడు వసంత శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.