Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-మహాదేవపూర్
మండలంలోని పలు గ్రామాల్లో వేటగాళ్ల ఉచ్చులకు పశువులు బలవుతున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ మండల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం మండలంలోని పూసుకుపల్లి అటవీ ప్రాంతంలో కాళేశ్వరానికి చెందిన 4 గేదెలు వేటగాళ్ల ఉచ్చులో పడి చనిపోయిన విషయం తెలిసిందే. అలాగే గతంలో మద్దులపల్లి, అన్నారం, పలుకుల, సండ్రపల్లి, తదితర గ్రామాల్లో వేటగాళ్ల ఉచ్చుతోపాటు విద్యుత్ తీగలకు తగిలి అడవి పందులు, పశువులు వన్యమగాలు చనిపోయాయి. అలాగే కొందరు వ్యక్తులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయినా పోలీసులు నామమాత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేటగాళ్లతోపాటు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కైనందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేటగాళ్ల బారి నుంచి పశువులను, వన్యప్రాణులను, జనాన్ని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.