Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ఉత్సాహంగా సైక్లోథాన్ ప్రారంభం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
మత్తు పదార్ధాల నియంత్రణలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల పని తీరు భేషుగ్గా ఉందిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సైక్లోథాన్ వరంగల్-2022 సైక్లింగ్ పోటీలను మంత్రి దయాకర్‌రావు జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. యువత మత్తు పదార్ధాలకు దూరంగా ఉండేలా చైతన్యం తీసుకొచ్చేలా సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమం ద్వారా మాదకద్రవ్యాల దుర్వినియోగంతో అక్రమ రవాణాపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఆరోగ్య పరిరక్షణ, ఆరోగ్యకరమైన ఆలోచనల కోసం సైక్లింగ్ దోహదపడే తీరుపై యువతకు అవగాహన కల్పించాలని కాంక్షించారు. సైక్లింగ్ వల్ల శారీరక వ్యాయమం చేసినట్లు అవుతుందన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణ కోసం పోలీసులు సాగిస్తున్న పోరాటంలో ప్రజలు తోడ్పాటు అందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కోరారు. తొలుత క్రీడాకారులతో సీపీ తరుణ్ జోషీ ప్రతిజ్ఞ చేయించారు. మంత్రి దయాకర్‌రావుతోపాటు చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్, వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి, వరంగల్ కలెక్టర్ గోపి సైక్లింగ్ చేసి స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా 25 కిలోమీటర్ల ఫుల్ రేస్, 15 కిలోమీటర్ల ఫన్ రేస్, 5 కిలోమీటర్ల కిడ్స్ రేస్ నిర్వహించారు. సైక్లోథాన్లో అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రా, బాలీవుడ్ నటుడు నకుల్ రోషన్, టేబుల్ టెన్నీస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ హాజరవగా అంతర్జాతీయ సైక్లిస్ట్ రాహుల్ మిశ్రా సైకిల్ తొక్కుతూ విన్యాసాలు చేశారు. అనంతరం విజేతలకు సీపీ తరుణ్ జోషీ పురస్కారాలు అందచేశారు. కార్యక్రమంలో బల్దియా కమిషనర్ ప్రావీణ్య, డీసీపీలు అశోక్ కుమార్, వెంకటలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.