Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
అబ్బో పులి ఇదిగో తోక బారెడు అన్నట్లుగా మండలంలో సోషల్ మీడియాలో పులి వస్తోందంటూ ఫేక్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో కొయ్యుర్ అటవీ శాఖ అధికారులు పులి అడుగుల, కదలికలపై విచారణ ముమ్మరం చేశారు. రుద్రారం సమీపంలోని తీగలవాగు బ్రిడ్జిపై పులి వెళ్లిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా కొయ్యుర్ రేంజ్ అధికారులు రుద్రారం, పెద్దతూండ్ల, శాత్రాజ్పల్లి, పీవీనగర్, నాగులమ్మ పరిధిలోని బ్రిడ్జీలు, అటవీ ప్రాంతాల్లో పరిశీలించారు. సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్న వీడియో ఇక్కడిది కాదని డిప్యూటీ రేంజర్ కొమురయ్య వెల్లడించారు. అటవీ ప్రాంతంలో నిఘా పెంచామన్నారు. నాలుగు టీమ్‌లు పులి కదలికలపై విచారణ కొనసాగిస్తోందని తెలిపారు. వేటగాళ్లు ఉచ్చులు పెట్టొద్దని, పశువుల కాపర్లు అడవిలోకి పశువులను మేతకు పంపొద్దని చెప్పారు. పులి సమాచారం తెలిస్తే అటవీ శాఖ అధికారులకు లేదా సిబ్బందికి తెలియజేయాలని కోరారు. పులికి హాని కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.