Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జులై 4న అన్ని జిల్లా కేంద్రాల్లో వర్ధంతి సభలు నిర్వహించాలి : జీఎంపీఎస్
నవతెలంగాణ-తొర్రూరు
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జూలై 4న రాష్ట్ర ప్రభుత్వమే అధికారి కంగా నిర్వహించాలని జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బొల్లం అశోక్ డిమాండ్ చేశారు. మంగళవారం తొర్రూర్ మండల కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు నిజాం నిరంకుశ ప్రభుత్వంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తికి జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కడవెంటి గ్రామంలో విస్నూరు దొర ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన ఆంధ్రమహాసభ ర్యాలీలో మొదటి అమరుడైన దొడ్డి కొమురయ్య వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. గొల్ల కురుమలకు ఇచ్చిన హామీలు గొర్రెల పంపిణీ వెంటనే ప్రారంభించాలని అన్నారు. దొడ్డి కొమురయ్య పేరుతో హైదరా బాద్లో భవనానికి శంకుస్థాపన చేసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పూర్తి చేయకుండా పాలకులు విస్మరించారని ఆరోపించారు. దొడ్డి కొమరయ్య భవనం వెంటనే పూర్తి చేసి, రాష్ట్ర రాజధాని హైదరా బాదులో ట్యాంక్ బండ్ పై దొడ్డి కొమరయ్య విగ్రహం నిర్మించాలని డిమాండ్ చేశారు. ప్రపంచ దేశాల లో దొడ్డి కొమరయ్య వీర చరిత్ర లిఖించబడి ఉందని, ఆ చరిత్రను ప్రచారం చేయడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎద్దు ఐలయ్య, సహాయ కార్యదర్శి పయ్యావుల ప్రవీణ్, చెవుల మహేష్, నరేష్, సందీప్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.