Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
సింగరేని కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) భూపాలపల్లి బ్రాంచ్ అధ్యక్షుడు వంగాల రామస్వామి డిమాండ్ చేశారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి గోదావరిఖనిలోని ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్ష కరపత్రాలను శుక్రవారం విడుదల చేశారు. అనంతరం రామస్వామి మాట్లాడారు. గత గుర్తింపు సంఘం ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ కేసీఆర్ స్వయంగా కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేస్తామని వాగ్దానం చేసినా నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. గతేడాది సెప్టెంబర్లో ప్రారంభమైన పోరాటం దశలవారీగా కొనసాగుతోందని చెప్పారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి దీక్ష చేపడుతున్న సందర్భంగా సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని, కార్యక్రమంలో కార్మికులు భాగస్వాములు కావాలని కోరారు. పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికుల అన్ని సమస్యలనూ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీను, రమేష్, నారాయణ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.