Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్రస్థాయిలో చట్టాన్ని, కమిషన్‌ను ఏర్పాటు చేయాలని వక్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఐద్వా, పట్నం, తదితర సంఘాల ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిశ్రిన్ సుల్తానా అధ్యక్షతన హనుమకొండలోని సుందరయ్య భవన్లో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు జి ప్రభాకర్‌రెడ్డి, ఎం చుక్కయ, హనుమకొండ జిల్లా జేఏసీ కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి పర్వతాలు, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు ధరావత్ భానునాయక్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నోముల కిషోర్, కార్యదర్శి దొగ్గెల తిరుపతి ప్రసంగించారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా 20 నుంచి 50 శాతం ఫీజులు పెంచుతూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని విమర్శించారు. ఒకే పేరుతో అనేక బ్రాంచీలు పెడుతూ విద్యా వ్యాపారం సాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇరుకైన గదుల్లో స్కూళ్లను నడుపుతూ ఫైర్ సేఫ్టీ లేకుండా ఉన్నాయని, పాఠశాలలను ఆధునిక దుకాణాలుగా మార్చి బుక్స్, యూనిఫామ్స్, బెల్టు, టై, నోట్ బుక్స్ అమ్ముతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీఓ నెంబర్ 91 ప్రకారం అడ్మిషన్ ఫీజు తీసుకోకూడదని, జీఓ నెంబర్ 42 ప్రకారం కార్పొరేటు, ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజులను ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఫీజుల నియంత్రణ కోసం 2016లో వేసిన తిరుపతిరావు కమిటీ రిపోర్టును బయటికి రాకుండా ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డుకుంటున్నాయని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, ప్రజాసంఘాల నాయకులు సంధ్య, చిట్యాల విజయకుమార్, పసుల ప్రసాద్, వల్లెపు లక్ష్మణ్, మధురకవి సుధీర్, దాసరి నరేష్, రాజు, జంపయ్య, అరుణ్, త్రివేణి, రాకేష్, చిరంజీవి, మురళీ, తదితరులు పాల్గొన్నారు.