Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్
నవతెలంగాణ-హన్మకొండ
ఈనెల 7 నుంచి కాకతీయ ఉత్సవాలను వేడుకగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. కాకతీయుల మొదటి రాజధాని అయిన హనుమకొండ నుంచి ఉత్సవాలను ప్రారంభించబోతున్న నేపథ్యంలో పద్మాక్షీ గుట్ట ప్రాంతంలోని జైన్ సైట్స్, సిద్దుల గుట్ట ప్రాంతాన్ని ప్రభుత్వం చీఫ్ విప్ దాస్యం వినరుభాస్కర్తో కలిసి వినోద్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వినోద్‌కుమార్, వినరుభాస్కర్ మాట్లాడారు. ఉత్సవాలకు సుమారు 700 ఏండ్ల తర్వాత కాకతీయుల 22వ వారసుడు, ప్రస్తుత బస్తర్ మహారాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ హాజరు కానున్నట్టు తెలిపారు. కాకతీయుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, ఇంటాక్ బాధ్యుడు ప్రొఫెసర్ ఎం పాండురంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ అజీజ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.