Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి
నవతెలంగాణ-సుబేదారి
ఈ విద్యాసంవత్సరం పెంచిన ఫీజులను 50శాతం తగ్గించాలని, ప్రయివేటు విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టాన్ని అమల్జేయాలని సీపీఐ(ఎం) జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. మంగళవారం హన్మకొండ జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రయివేట్ పాఠశాలలు తన ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తున్నాయన్నారు. లాగే ప్రతి స్కూల్ లో పాఠ్య పుస్తకాలూ షూలు, బెల్టు, టై, డొనేషన్, రిజిస్ట్రేషన్ ఫీజుల పేరుతో విద్యార్థుల తల్లితండ్రుల పై మోయలేని భారాలు మోపుతున్నారన్నారు. అనేక పోరాటాల ఫలితంగా ఫీజులు తగ్గించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతి రావు కమిషన్ వేసిందన్నారు. దీంతో ఫీజుల పెంపును నియంత్రించకుండా ఏటా 5 నుండి 10 శాతం వరకు మాత్రమే పెంచుకోవాలని సూచించిందన్నారు. కనీసం పేరేంట్స్ కమిటీ అభిప్రాయలు తీసుకోకుండా ప్రయివేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయన్నారు. విద్యాహక్కు చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో 25 శతం ఉచిత విద్యను అందించాలనే నిబంధన అమలు కావడం లేదన్నారు. ప్రైవేట్ పాఠశాలలో పని చేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి వేతనాలు పెంచాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, ఖాళీ ఉపాధ్యాయ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని, పాఠ్య పుస్తకాలు వెంటనే అందించాలని డిమాండ్ చేసారు. లేదంటే ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం డీఈ ఓ కార్యాలయ సూపరింటెండెంట్‌కు వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కన్వినింగ్ కమిటీ సభ్యులు సారంపెల్లి వాసుదేవరెడ్డి, వాంకుడోతు వీరన్న, రాగుల రమేష్, మంద సంపత్, డి.భాను నాయక్, డి.తిరుపతి, కాడబోయిన లింగయ్య, మిశ్రీన్ సుల్తానా, ప్రజాసంఘాల నాయకుల టి.ఉప్పలయ్య, గొడుగు వెంకట్, కుమార్, కిశోర్, మల్లేశం, సంపత్ తదితరులు పాల్గొన్నారు.