Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 6నెలలుగా కమిటీ ఏర్పాటులో జాప్యం
- ఆర్భాటానికే ప్రాధాన్యత...
- మంత్రి ఆదేశాలు భేఖాతర్
- ప్రయివేటు విద్యతో పేదలపై భారం
- అందని ద్రాక్షలా ఇంటర్ విద్య
నవతెలంగాణ-పాలకుర్తి
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఏండ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కలగానే మిగులుతోంది. దీంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్ చదవడానికి పట్టణాలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా ప్రయివేటు యాజమాన్యం లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతో పేదలపై ఆర్థికభారం పడుతోంది. దీంతో రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసి తీరాలని, కమిటీని ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు మండల నాయకత్వానికి ఆదేశాలు జారీ చేశారు. కమిటీ అనంతరం తానే డిపాజిట్ చేస్తానని భరోసా ఇచ్చినప్పటికీ కమిటీ ఏర్పాటు పై స్పష్టత రాలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివద్ధి కమిటీ ఏర్పాటుపై దష్టిపెట్టని పరిస్థితి. దీంతో కళాశాల ఏర్పాటు ప్రకటనలకే పరిమిత మైందని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది పాలకుర్తి మండలవ్యాప్తంగా 695మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 661మంది ఉత్తీర్ణులయ్యారు. నియోజకవర్గంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభిస్తే సుమారు 200 నుండి 300మంది విద్యార్థులకు ఇంటర్ విద్య అందుబాటులో ఉండేది. కానీ, మండల ప్రజా ప్రజా ప్రతినిధులు, మండల నాయకుల నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇంటర్ విద్యకు దూర మయ్యే పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని రిటైర్డ్ అధ్యాపకులతోపాటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పలుమార్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు విన్నవించాయి. స్పందించిన మంత్రి కళాశాల ఏర్పాటుకు కావాల్సిన వసతులతోపాటు, భవనాన్ని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులతోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో పలుమార్లు పరిశీలించారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల భవనంలో జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ముహూర్తాన్ని సైతం ఖరారు చేశారు. కళాశాల నిర్వహణతో పాటు మౌలిక వసతుల కల్పనకు కమిటీ ఏర్పాటు చేసి రూ.4లక్షల50 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంది. ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ కమిటీ ఏర్పాటులో జాప్యం నెలకొంది. కమిటీ ఏర్పాటు కోసం రెండు మూడు సార్లు సమావేశమైనప్పటికీ కమిటీని ప్రకటించడంలో నిర్లక్ష్యం చేశారనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా కళాశాల అభివద్ధి కమిటీ ని ఏర్పాటు చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని చేపట్టాలని ప్రజలు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌కు నివేదించాం
పాలకుర్తిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కోసం ఉన్నత విద్యాశాఖ కమిషనర్ కు నివేదిక సమర్పించాం. కళాశాల ఏర్పాటు కోసం పాలకుర్తి ఉన్నత పాఠశాలలో భవనం పరిశీలించాం. అది అనుకూలంగా ఉంది. కమిటీ ఏర్పాటు పట్ల జాప్యం జరిగింది. కమిటీ ఏర్పడితే కళాశాలను ప్రారంభించేందుకు సానుకూలంగా ఉన్నాం.
- శ్రీనివాస్, ఇంటర్ బోర్డు జనగామ జిల్లా అధికారి