Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆనాదిగా కొనసాగుతున్న ఆచారం
- సీత్ల వేడుకలకు తండాలు ముస్తాబు
- నేటి నుండి తండాల్లో సీత్ల వేడుకలు
నవతెలంగాణ-బయ్యారం
ప్రత్యేకించి లంబాడీ గిరిజనులు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. వారి పండుగలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. వారు ప్రకృతిని ప్రేమించడం, పూజించడమే వారి ఆనవాయితి. వారు చేసే ఒక్కో పండుగ ఒక్కో సందేశాన్నిస్తాయి. ప్రత్యేకించి గిరిజన లంబాడీలు జరుపుకునే సీత్లా పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. గిరిజనులు తమ పశుసంపదను రక్షించుకోవడానికి, వర్షాలు సకాలం లో కురిసి పంటలు పండాలని గిరిజనులు సీత్లా పండుగను జరుపుకోవడం ఆనాదిగా కొనసాగుతోంది. గోర్ బంజా రులు ఈ పండుగను జరుపుకుంటారు. పెద్ద పుషాల కార్తిలో ప్రతీ గిరిజన తండాల్లో సీత్లా పండుగా కనిపిస్తుంది. నేడు(మంగళవారం) పండుగను జరుపుకునేందుకు తెలుగు రాష్ట్ట్రాలతో పాటు వివిధ గిరిజన తెగలు కూడా ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సీత్లా పండుగను వాడుక బాషలో దాటుడు, బావాని పండుగ అని కూడా పిలుస్తారు. పునర్వసు (పెద్దపుషాల) కార్తెలో ఏదైనా మంగళవారం సీత్లా మాతను పూజిస్తారు. ఇండ్లలో కాకుండా తండాకు దగ్గరగా ఊరు చెరువు ఒడ్డున పూజలు నిర్వహిస్తారు. పొడవాటి రాళ్ళతో తయారు చేసిన ప్రతిమలతో ఈ ఎడుగురి భావానీలను ఒకే వరుసలో తూర్పున ప్రతిష్టిస్తారు. భవానీ ప్రతిమకు ఎదురుగా 100 అడుగుల దూరం లూంకడియా ప్రతిమను భవానీల వైపు చూపేల ప్రతిష్టిస్తారు. ఇలా ఏటా సీత్లా పండుగ జరుపుకునే సమయానికి భవానీలను ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఒక్కరోజు ముందు జొన్నలు, పప్పు ధాన్యాలు కలిపి నాణబెట్టిన తర్వాత తయారైన గుగ్గిళ్ళను తెలవారిన తరువాత జరిగే సీత్లా పండుగకు నైవేధ్యంగా తీసుకువెళ్తారు. ఈ నైవేధ్యాన్ని నెత్తిపై పెట్టుకొని డప్పుమేళాలతో నృత్యాలు చేసుకుంటూ ఊరి నుంచి బయలుదేరి సందడిగా సీత్లా భవానీల వద్దకు చేరుకుం టారు. ఈ నైవెధ్యాన్ని ప్రత్యేకించి పెండ్లి కాని యువతతో సీత్లా భవానిలకు సమర్పిస్తారు. పూజారి ప్రాచీన నైవేధ్యంను పశువుల పై చల్లుతారు. దీంతో పశువులకు వ్యాధులు రాకుండా ఉంటాయని నమ్మకం.
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
గిరిజనులందరూ సీత్లా పండుగను ఒకే రోజున జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయం. మరుగున పడుతున్న గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన భాధ్యత నేటి గిరిజన లంబాడి యువతపై ఉంది. సీత్లా పండుగ ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే గిరిజనుల ఆచారం కాపాడినట్టు అవుతుంది. సీత్లా పండుగ విశిష్ఠతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ గుర్తింపును ఇచ్చేవిధంగా కృషి చేస్తాను. సీత్లా పండుగ జరుపుకుంటున్న గిరిజన లంబాడీ ప్రజలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు.
- బానోతు హరిప్రియనాయక్, ఇల్లందు ఎమ్మెల్యే
సీత్లా పండుగను ఘనంగా జరుపుకోవాలి
సీత్లా పండుగను గిరిజన లంబాడిలందరూ ఆయా ప్రాంతాలలో ఓకే రోజు ఘనంగా జరుపుకోవాలి. పెద్దపుషాల కార్తిలో మొదటి మంగళవారంలో ఈ పండగను గిరిజన తండాలలో ఘనంగా జరుపుకోవాలి. ఈ పండుగ లంబాడీల సంస్కృతి సంప్రాదాయాలను చాటి చెపుతుంది. సీత్లా పండుగకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చేలా సీఎం దృష్టికి తీసుకెళ్లాను.
-ఆంగోతు బిందు, జెడ్పీ చైర్పర్సన్, మహబూబాబాద్