Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేవాదుల ఇన్‌టేక్‌వెల్ వద్ద 83 మీటర్ల నీటిమట్టం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో అటవీ గ్రామాలు అతులాకుతలమవుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతుంది. ములుగు జిల్లాలో ఏటూర్‌నాగారం, మంగపేట మండలాల్లో గోదావరి నదికి భారీ వరద చేరడంతో నేల కోతకు గురై రైతులు పంట భూములను నష్టపోయారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం వద్ద వరద ఉధృతి తీవ్రంగా వుంది. కాళేశ్వరం బ్యారేజీ వద్ద వరద పొంగిపొర్లుతుంది. లక్ష్మీ, పార్వతి, సరస్వతి బ్యారేజీలకు ఇన్‌ఫ్లోగా వస్తున్న వరదను అవుట్ ఫ్లోగా విడుదల చేస్తున్నారు.
కరకట్టల నిర్మాణంలో నిర్లక్ష్యంపై ఆగ్రహం
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని మంగపేటలో కరకట్టల నిర్మాణానికి రూ.137 కోట్ల మంజూరైన పనులు చేయకపోవడంతో పంటల భూములు కోతకు గురై రైతులు తీవ్రంగా నష్టపోవడంపై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్టల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఏటూర్‌నాగారం, మంగపేట మండలాల్లో కరకట్ట నిర్మాణాలు వెంటనే చేపట్టాలని సీతక్క డిమాండ్ చేశారు.
కాళేశ్వరం వద్ద గోదావరి పరవళ్లు
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు భారీ వరదతో పరవళ్లు తొక్కుతున్నాయి. కాళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నదీ జలమట్టం 10.08 మీటర్ల మేరకు వుంది. లక్ష్మీ బ్యారేజీకి భారీ వరద చేరుకుంటుండడంతో 81 గేట్లు ఎత్తి 6.60 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతి బ్యారేజీలో 58 గేట్లు ఎత్తి 1.77 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సరస్వతి బ్యారేజీలో 1.27 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
సమ్మక్క బ్యారేజీలో 82 గేట్లు ఎత్తివేత
ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని సమ్మక్క బ్యారేజీకి ఎగువ నుండి భారీ వరద చేరుతుండడంతో 82 గేట్లు ఎత్తి 80.90 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్ వెల్ వద్ద గోదావరి నీటి మట్టం 83.70 మీటర్లకు చేరుకుంది. ఇక్కడ 71 మీటర్ల నీటిమట్టం వుంటే దేవాదుల ప్రాజెక్టు మోటర్లను రన్ చేయించవచ్చు. అంతకుమంచి నీటిమట్టం వుండడంతో త్వరలోనే అధికారులు మోటర్లను రన్ చేయించే అవకాశముంది. తద్వారా దేవాదుల ప్రాజెక్టు మూడు దశలకు సాగునీరందించే అవకాశం ఉంది.
అలుగుపోస్తున్న భద్రకాళి చెరువు
హన్మకొండ జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రకాళి చెరువుకు మంగళవారం అలుగు పోస్తుండడంతో సమీపంలోని నగరవాసులు మత్తడి అందాలు తిలకించడానికి వెళ్తున్నారు. హన్మకొండ జిల్లాలో సగటున 1.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా శాయంపేటలో 3.2, ఐనవోలులో 2.5, ఆత్మకూరులో 2.3, హన్మకొండలో 2.3, కాజీపేటలో 2.0 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. భూపాలపల్లి జిల్లాలో మహాముత్తారంలో 8.6, మహదేవ్‌పూర్‌లో 5.9, కాటారంలో 3.0, మల్హల్రావు 2.1, గణపురంలో 2.5, భూపాలపల్లిలో 2.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. గణపురం చెరువులో 27 అడుగులకు వరద నీరు చేరుకుంది. మండలంలో మోరంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.