Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప్పొంగిన వాగులు, వంకలు
- స్తంభించిన జనజీవనం
- నీట మునిగిన పంటలు
నవతెలంగాణ-మల్హర్రావు
నాలుగైదు రోజులుగా వర్షం జోరు కొనసాగిస్తుండడంతో మండలంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మంగళవారం జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. మండలంలోని నాచారం, ఆన్సాన్పల్లి, తాడిచెర్ల, కుంభంపల్లి, కొయ్యుర్, మల్లారం, రుద్రారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, వల్లెంకుంట గ్రామాల్లో అంతర్గత రోడ్లు కొట్టుకుపోయాయి. ఇండ్లు, ఇంటి గోడలు నేలమట్టమయ్యాయి. కల్వర్టులు దెబ్బతిన్నాయి. బొగ్గులవాగు, కాపురం, అరే వాగు, మానేరు తదితర జలాశయాలు నిండు కుండలా తయారయ్యాయి. గొర్రెల కాపరుల, గొర్రెల పరిస్థితి దయనీయంగా మారింది. వర్షానికి తడిసి వణుకుతున్న పరిస్థితి.
రోడ్లు ధ్వంసం... పంటలకు నష్టం
మండలంలోని నాచారం ఎస్సీ కాలనీలోని ఆర్ అండ్ బీ రోడ్డు వరద తాకిడికి తెగిపోయింది. తాడిచెర్ల, రుద్రారం, కొయ్యూర్, ఆన్సాన్పల్లి గ్రామాల్లో అంతర్గత రోడ్లు ధ్వంసం అయ్యాయి. పలు ఇండ్లు, ఇండ్ల గోడలు కూలాయి. 15 గ్రామ పంచాయతీల పరిధిలో నాట్లు, నారుమళ్లు, ఇతరత్రా పంటలు వరద తాకిడికి కొట్టుకుపోయాయి. మానేరు ముంపునకు గురై ట్రాన్స్ఫార్మర్లు, రైతుల మోటార్లు దెబ్బతిన్నాయి. వరదల్లో ఇప్పటికే 50 గొర్రెలు కొట్టుకపోయాయి. బాధిత రైతులను, గొర్రెల కాపరులను ప్రభుత్వం ఆదుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.