Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్టీ టికెట్ కోసం పోటాపోటీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు డిసిసి పదవి కోసం మరోవైపు స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరా అనారోగ్య కారణాల వల్ల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌లో చేరిన దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, ధర్మసాగర్ మండలానికి చెందిన పిసిసి సభ్యుడు గంగారపు అమృతరావుతోపాటు డాక్టర్ బొల్లపల్లి కృష్ణ తదితరులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 'దొమ్మాటి' స్థానికేతరుడు కావడంతో స్థానికులకే పార్టీ టికెట్ ఇవ్వాలన్న నినాదం కూడా పార్టీ నేతలు చేస్తుండడం గమనార్హం. ఈలోపు జనగామ డిసిసి అధ్యక్ష పదవి ఎన్నికతోపాటు పీసీసీ సభ్యుల ఎన్నికలు కూడా 'స్టేషన్'లో జరుగబోయే మార్పులకు సూచనగా మారే అవకాశాలు లేకపోలేదు.
జనగామ జిల్లా కాంగ్రెస్‌లో నేతల మధ్య రసవత్తరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల హైద్రాబాద్‌లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్ ఆధ్వర్యంలో జిల్లా డిసిసి అధ్యక్షుల సమావేశం జరిగింది. ఇదే చివరి అధ్యక్షుల సమావేశం అని మాణిక్కం ఠాగూర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ క్రమంలో జనగామ డిసిసి అధ్యక్ష పదవి రేసులో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఇదిలావుంటే స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ టికెట్‌కు రసవత్తర పోటీ నెలకొంది. గతంలో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరా అనారోగ్య కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో స్టేషన్‌ఘన్‌పూర్ టికెట్‌ను దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, గంగారపు అమృతరావు, డాక్టర్ బొల్లపల్లి కృష్ణ తదితరులు తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరితోపాటు మరికొందరు కూడా లైన్లో ఉన్నారు.
'స్థానికేతరుడు'పై లొల్లి..
స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. గతంలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య, మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య, సింగపురం ఇందిరా, పిసిసి సభ్యులు గంగారపు అమృతరావు, ఎంపిపి మేకల వరలక్ష్మీ భర్త కడారి నరేందర్ మాజీ మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ కడారి నాగేశ్వర్రావు, డాక్టర్ బొల్లపల్లి కృష్ణ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరా అనారోగ్య కారణాలతో నియోజకవర్గానికి రావడం లేదు. ఇదిలావుంటే దొమ్మాటి సాంబయ్య పరకాల మండలం నర్సక్కపల్లె గ్రామస్తుడు. దీంతో 'దొమ్మాటి' స్థానికేతరుడని, స్థానికేతరులకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో పార్టీ టికెట్ ఇవ్వవద్దని పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుంటే 'దొమ్మాటి' పిసిసి సభ్యుడిగా నియమించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. రేవంత్‌రెడ్డితోపాటు 'దొమ్మాటి' కాంగ్రెస్‌లో చేరడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఈసారి తనకు చివరి అవకాశంగా పార్టీ టికెట్ ఇవ్వాలని 'దొమ్మాటి' పార్టీ నాయకత్వానికి చెబుతున్నట్లు సమాచారం.
స్థానికుల ఆరాటం..
స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ టికెట్ విషయంలో ఇప్పటికే సింగాపురం ఇందిరా, పిసిసి సభ్యులు గంగారపు అమృతరావు కలిసి పనిచేస్తున్నారు. రాహుల్‌గాంధీ బహిరంగ సభ అనంతరం ఇందిరా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండడంతో అమృతరావు ఈ మేరకు అన్ని గ్రామాల్లో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని 7 మండలాల పార్టీ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి సమర్ధుడైన నియోజకవర్గ ఇన్‌ఛార్జిని నియమించాలని కోరారు. ఈ మేరకు టిపిసిసి అధ్యక్షుడి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిశారు. ఇందిరాతో మాట్లాడి అమృతరావుతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు పలు సందర్భాల్లో కలిసి పనిచేసినా, రాహుల్ గాంధీ బహిరంగసభ అనంతరం ఇందిరా పార్టీ కార్యక్రమాలకు దూరంగా వున్నారు. దీంతో స్థానిక కాంగ్రెస్ నేతల్లో అయోమయం నెలకొంది. మాజీ ఎంపి సిరిసిల్ల రాజయ్య వరంగల్ పార్లమెంటుకే మొగ్గుచూపితే ప్రధానంగా దొమ్మాటి సాంబయ్య, గంగారపు అమృతరావు, డాక్టర్ బొల్లపల్లి కృష్ణల మధ్య ప్రధాన పోటీ వుండే అవకాశం లేకపోలేదు. ఒకపక్క దొమ్మాటి సాంబయ్య, మరోవైపు అమృతరావు ఎవరికివారే కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా. ప్రముఖ వైద్యులు డాక్టర్ బొల్లపల్లి కృష్ణ ఎస్ఎస్కె స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఉచిత వైద్య సేవలందించారు.
జనగామ డిసిసి అధ్యక్ష పదవి రేసులో 'పోరెడ్డి'
జనగామ డిసిసి అధ్యక్షుని పదవి రేసులో లింగాలఘనపురానికి చెందిన పోరెడ్డి మల్లారెడ్డి వున్నారు. ప్రస్తుత జనగామ డిసిసి అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో హన్మకొండ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలో ఈసారి జనగామ డీసీసీ అధ్యక్ష పదవి నుంచి 'జంగా'ను తప్పించే అవకాశాలున్నాయి. దీంతో జనగామ డిసిసి అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు పోరెడ్డి మల్లారెడ్డి జనగామ డిసిసి అధ్యక్ష పదవికి పోటీలో వున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన 'పోరెడ్డి' బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రముఖ హోటల్ యజమాని పోరెడ్డి మల్లారెడ్డి ఇప్పటికే ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.