Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భయాందోళనలో రైతన్నలు
నవతెలంగాణ-మల్హర్రావు
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని మానేరు పరివాహక ప్రాంతలైన తాడిచెర్ల, మల్లారం, పివి నగర్, కుంభంపల్లి, వల్లెంకుంట, కేశారంపల్లి గ్రామాల రైతులకు కాళేశ్వరం బ్యాక్ వాటర్ భయం పట్టుకుంది. రైతులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఇప్పటికే మానేరు ఉదతంగా ప్రవహిస్తుండం, అందుకు తోడుగా కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో కుంభంపల్లి, దామెరకుంట, గంగారం గ్రామాల్లోని వరి, పత్తి పంటలు నీట మునిగి, ఇండ్లలోకి నీరుచేరి గ్రామాలు జలదిగ్బందానికి గురయ్యాయి.
ఆందోళనలో రైతన్నలు..
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషంగా విత్తనాలు విత్తారు. అక్కడక్కడా నారుమళ్లు పచ్చబడటం, పత్తి మొలకెత్తడం, కొన్ని గ్రామాల్లో రెండు ఆకుల్లో కనిపించడం మినహా ఈ ఏడాది పెద్డగా ఇబ్బందులు తలెత్తలేదు. దీంతో ఈ ఏడాది మండలంలో 8 వేల వంద ఎకరాల్లో పత్తి, 11 వేల 950 ఎకరాల్లో వరి, 250 ఎకరాల్లో ఇతర పంటలు వేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికి 4 వేల 670 ఎకరాల్లో పంటలు వేశారు. అంతా బాగున్న సమయంలో ముసురు కమ్ముకోవడంతో ఇప్పటికే 3 వేల ఎకరాల్లో పత్తి, వరి నారుమళ్లు నీట మునిగి రైతులు నష్టపోయినట్టు మండల వ్యవసాయ అధికారులు చెప్పారు. వర్షం ఇలాగే కొనసాగితే మిగతా వెయ్యి 670 ఎకరాల్లో వేసిన పంటలు నీట మునగడం ఖాయమని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మానేరు ఉగ్రరూపం దాల్చితే, కాళేశ్వరం బ్యాక్ వాటర్ వస్తే పరిస్థితి ఏమిటని రైతులు తలలు పట్టుకుంటున్నారు.
బ్యాక్ వాటర్ చేరకుండా కరకట్ట నిర్మించాలి : మల్హర్రావు, ఎంపీపీ
మానేరు పరివాహక ప్రాంతాల్లో కాళేశ్వరం, మిడ్ మానేరు బ్యాక్ వాటర్, మానేరు ముంపునకు పొలాలు గురికాకుండా 10 మీటర్ల ఎత్తుతో తాడిచెర్ల నుంచి కుంభంపల్లి వరకు కరకట్టి నిర్మించాలి. గత మూడేండ్లుగా ముంపునకు గురౌ తున్న పొలాలకు సంబంధించి బాధిత రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు.
చెక్‌డ్యామ్ నిర్మాణాలతో రైతులకు నష్టం
అక్కల బాపు, ప్రజాసంఘాల నాయకుడు
మానేరుపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లతో రైతులకు నష్టమే. పాలకులు, కాంట్రాక్టర్లు, అధికారులు సొమ్ము చేసుకునేందుకే ఉపయోగపడుతున్నాయి. వాటి వల్ల మానేరు పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాల పొలాలు ముంపునకు గురై రైతులు భారీగా పంటలు నష్టపోతున్నారు.