Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగుకు భారీగా రాయితీలు
- హెక్టారుకు రూ.12-29 వేలకు పెంపు
- పంటకు అనుకూలంగా భూపాలపల్లి నేలలు
- జిల్లాలో 7 వేల 542 ఎకరాల్లో సాగుకు సన్నాహాలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చొరవ చూపుతోంది. ఇందులో భాగంగా సాంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలు సాగు చేసేలా రైతన్నలను ప్రోత్సహిస్తోంది. ఆయిల్ పామ్ పంట సాగు చేసేలా జిల్లా కలెక్టర్‌తోపాటు వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీనికితోడు గతంలో హెక్టారుకు రూ.12 వేల రాయితీ ఇచ్చిన ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశ అనంతరం రాయితీని మరో రూ.17లు పెంచి హెక్టారుకు రూ.29 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో రైతన్నలు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్నారు.
గతేడాది...
జిల్లాలో గతేడాది 140 మంది రైతులు సుమారు 300 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేశారు. వారికి జిల్లాలోని నర్సరీలో 18 వేల మొక్కలు అక్టోబర్‌లో పంపిణీ చేశారు. ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు బ్యాంకులు రుణాలు ఇచ్చేలా అధికారులకు సన్నాహాలు చేశారు.
ఈ ఏడాది 4.29 లక్షల మొక్కలు పంపిణీకి సిద్ధం
ఆయిల్ పామ్ పంట సాగుకు భూపాలపల్లి నేలలు అనుకూలంగా ఉండడం తో అధికంగా సాగు చేసేలా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి రైతులను ప్రోత్స హిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వ రావుపేటలో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంటను పరిశీలించేందుకు తీసు కెళ్లారు. దీంతో జిల్లాలో 4 వేల మంది రైతులను అధికారులు గుర్తించగా 7 వేల 542 ఎకరాల్లో సాగు చేసేందుకు 18 వందల మంది రైతులు ముందుకొచ్చారు. వీరికి ఒక్కో ఎకరానికి 57 చొప్పున మొక్కలను పంపిణీ చేసేందుకు రేగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన నర్సరీలో 4 లక్షల 29 వేల 894 మొక్కలు పెంచుతున్నారు. వీటిని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో పంపిణీ చేయనున్నారు.
రాయితీ పెంపు....
ఆయిల్ పామ్ సాగుకు ఎకరానికి రూ.60 వేల ఖర్చు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన రాయితీ రూ.12 వేలకు మరో రూ.17 వేలు కలిపి రూ.29 వేలు చేశారు. రాయితీ పోను మిగతా పెట్టుబడిని బ్యాంకు రుణాల రూపంలో రైతులకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలు సాధించాలి
భవిష్ మిశ్రా, జిల్లా కలెక్టర్
ఆయిల్ పామ్ సాగు లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకాంక్షించారు. ఆ పంట సాగుపై కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ, సువేన్ ఆగ్రో కంపెనీ, ఎంఐ అధికారులు, ఏఈఓలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ప్రస్తుత 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 7 వేల 450 ఎకరాల లక్ష్యాన్ని హార్టికల్చర్ డైరెక్టర్ కేటాయించారు. సాగు లక్ష్యాన్ని సాధించడానికి ఆయిల్ పామ్ మొక్కలు సరఫరా చేస్తూ సూక్ష్మ నీటి పారుదల పథకాలను అనుసంధానం చేస్తూ కలెక్టర్ పలు సూచనలు అందించారు. ఏఈఓలు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. నెలకు వెయ్యి ఎకరాల ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకొని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని 45 క్లస్టర్లను ఏఈఓలు, మైక్రో ఇరిగేషన్ సిబ్బంది క్రమపద్ధతిలో రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతి శనివారం జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని, వారంలో సాధించిన లక్ష్యాలను సమీక్షిస్తామని కలెక్టర్ తెలిపారు. అవంతారాలను అధిగమిస్తూ భౌతిక లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన సదస్సులు
ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి
ఆయిల్ పామ్ సాగుతో రైతులు ఆర్థిక అభివృద్ధి చెందుతారని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎంఏ అక్బర్ తెలిపారు. జిల్లాలోని రైతులకు రైతు వేదికల్లో ఉద్యాన శాఖ అధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపై సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తామన్నారు. ఆయిల్ పామ్ సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు, పంట వేయడానికి అనువైన పరిస్థితులు, నెలలు నీటి వసతి అన్ని కూడా అనువైనవిగా గుర్తించడం వల్ల ఆ పంటను జిల్లాలో సాగు చేయడానికి అన్ని రకాల అనుమతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. ఈ పంట ద్వారా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందడానికి వీలు ఉంటుందని చెప్పి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ పంటలు ఎటువంటి చీడపీడలు ఉండని పరిస్థితిలో రైతులకు పెట్టుబడి ఖర్చులు ఉండవన్నారు. ఈ పంటకు ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం మొక్కలకు 85 శాతం రాయితీ, అంతర పంటలకు, ఎరువులకు, డ్రిప్ పరికరాలను రాయితీతో అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలను వినియోగించుకుంటే రైతులు ఆయిల్ పామ్ సాగుతో భారీగా లాభాలు గడించొచ్చని చెప్పారు. అలాగే రైతులు అంతర పంటల ద్వారా మొదటి నాలుగేండ్ల వరకు ఆదాయం పొందవచ్చని వివరించారు.