Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మూలంగా పంటల రక్షణకు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఏఓ జక్కుల ఉదరు రైతులకు సూచించారు. గురువారం మండలంలోని గుండంపల్లి తిమ్మాపురం గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాట్లు వేసిన పొలాల్లో మొక్కలు దెబ్బతింటే పొలాలను దమ్ము చేసుకొని స్వల్పకాలిక రకాలతో నేరుగా విత్తుకోవాలన్నారు. ఇప్పటివరకు నారు పోయని రైతాంగం పొలాలను దమ్ము చేసుకోవాలని, వానలు వెలిసినాక వెదజల్లే పద్ధతిలో వరి వేయడం వలన పెట్టుబడి ఆదా చేసుకోవచ్చన్నారు. నారుమడి లలో అగ్గి తెగులు రావడానికి అవకాశాలు ఉన్నందున ట్రైసైక్లోజల్, మ్యాంకో జెబ్ లేదా ఐసోప్రోథయోలేన్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలని అన్నారు. మొక్కజొన్న, పత్తి చేలల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి అన్నారు.వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఎకరాకు 20 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ ను వేయాలన్నారు. వర్షాలు తగ్గిన తర్వాత కత్తెర పురుగు ను గమనిస్తే క్లోరంట్రానిలిప్రోల్ లీటరు నీటిలో కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారి చేయాలని సూచించారు. వారి వెంట సర్పంచ్ గట్టి నర్సయ్య(బాబు), రైతులు పాల్గొన్నారు.
పంటల వివరాలు సేకరణ
ఎదుళ్ల పల్లి క్లస్టర్ పరిధిలోని ఎదుళ్లపల్లి గ్రామంలో పంటల వివరాలు సేకరించడం జరుగుతుందని ఏఈఓ వినోద్ తెలిపారు. గురువారం మండలం లోని ఎదుళ్లపల్లి గ్రామంలో పంటల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులందరూ పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు తప్పనిసరిగా అందించాలన్నారు. ఈ పంటల వివరాల ద్వారానే ధాన్యాన్ని సమకూర్చే సమయంలో టోకెన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కనక రైతులందరూ సరైన సమాచారం అందించాలన్నారు.