Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి
- బ్యాంకుల ఎదుట ధర్నాలు
నవతెలంగాణ-జనగామ
వ్యవసాయ పంట రుణాలను రైతులకు బ్యాంకులు తక్షణమే అందించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద ఉన్న ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్న ఎస్బీఐ బ్యాంకుల ఎదుట తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య చందు నాయక్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సదర్భంగా మోకు కనకారెడ్డితోపాటు, కౌలు రైతు సంఘం నాయకులు బూడిద గోపి పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుతం రైతులకు పంట సాగు కోసం డబ్బులు అత్యవసరమని, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించే వీలుందన్నారు. బ్యాంకు రుణాలు అందించాలన్నారు. వానాకాలంసాగు ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నదని, ఇంతవరకూ బ్యాంకులు ప్రకటించిన రుణ ప్రణాళికను అమలు చేయలేదని విమర్శించారు. వ్యాపార రంగంలో 40శాతం వ్యవసాయ రుణాలు బ్యాంకులివ్వాలని, అందులో 18శాతం పంట రుణాలు, 22శాతం దీర్ఘకాలిక రుణాలివ్వాలని నిబంధనలు ఉన్నాయన్నారు. రుణాల మొత్తంలో 15శాతం దళిత, గిరిజనులకు విధిగా ఇవ్వాలని ఉన్నా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీగానీ, జిల్లా స్థాయిలో జరుగుతున్న బ్యాంకర్ల సమావేశాలు పట్టించుకోవట్లేదన్నారు. ఆ కమిటీలలో రైతు ప్రతినిధులను లేకుండా చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పంట రుణాలకు వానాకాలం రూ.51,230 కోట్లు ప్రకటించారని, ఆచరణలో రైతులకు రుణాల పంపిణీ కావడంలేదని అన్నారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రైతుల నుండి వసూళ్లు కానీ జప్తులు కానీ చేయరాదని రిజర్వుబ్యాంకు ఆదేశాలున్నప్పటికీ రైతుబంధు నిధులు, ధాన్యం డబ్బులను బ్యాంకులు రైతులకు ఇవ్వకుండా తమ పాత బాకీల కింద పెట్టుకుంటున్నారని అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇస్తామని చెప్పిన బ్యాంకర్లు ఏనాడూ ఆ నిబంధనను పాటించలేదని అన్నారు. రైతులు యంత్రాల అద్దెలు, ఉపకరణాల కొనుగోళ్ళు, కూళ్ళు తదితర పనుల నుండి బయట పడడానికి చాలామంది రైతులు ప్రైవేటు రుణాలకు పరుగులు పెడుతున్నారని అన్నారు. ప్రయివేటు వడ్డీ వ్యాపారులు 24శాతం నుండి 36శాతం అక్రమ వడ్డీలు వసూళ్లు చేస్తున్నారని అన్నారు. వడ్డీ భారం పెరిగి అనేకమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ బ్యాంకులకు చెల్లించకపోవడంతో తిరిగి రైతులకు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఏకమొత్తంలో మాఫీ చేయడంగానీ, రుణ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో వేసుకుని వాయిదాల ప్రకారం బ్యాంకులకు చెల్లించి, రైతులను రుణ విముక్తులను చేయాలన్నారు. కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి పంట రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆయా బ్యాంకు మేనేజర్ లకు అందజేశారు. తెలంగాణ రైతు సంఘం నాయకులు సీనియర్ నాయకులు గురజాల లక్ష్మీనరసింహారెడ్డి నర్సిరెడ్డి, పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య, మంగ బీరయ్య, ఉర్సు కుమార్ మల్లారెడ్డి, అత్కురి ఎల్లయ్య, గాజుల నాగరాజు, కర్రే రాములు, కర్రె బీరయ్యా, కోయల్ కార్ నాగరాజు, సాయి ప్రకాష్ శ్రీనివాస్, మల్లేష్, లక్ష్మయ్య, శ్రీను, దానమ్మ, శివ , సంపత్, అంజయ్య మల్లయ్య, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.
రుణాలు ఇవ్వాలని నిరసన
దేవరుప్పుల :తక్షణమే రైతు రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని మండలంలోని ఎబిజివిబి ముందు రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం మండల కార్యదర్శి కాసర్ల మాధవరెడ్డి మాట్లాడుతూ... లక్ష రూపాయల లోపు రుణం ఏకకాలంలో మాఫీ చేయాలని,ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రుణాలు నగదు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. రైతుబంధు,ఇతర లావాదేవీలు జరుపు సమయంలో రైతు రుణాలలో కోతలు విధించడం సరైంది కాదని అన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎబిజివిబి మేనేజర్ శిరీషకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు సింగారపు,పయ్యావుల బిక్షపతి,ఇంటి వెంకట్ రెడ్డి, మడిపల్లి యాదగిరి,రాంచద్రయ్య, కీమ,నర్సయ్య, సోమ్ల తదితరులు పాల్గొన్నారు.