Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాల పేంట సమీపంలోని సరిహద్దు ప్రాంతంలోని అడవి అందాల నయగారగా పిలవబడే ఏడు బావుల జలపాతం పర్యా టకులను అలరిస్తోంది. జిల్లాలోనే ఎత్తయిన జలపాతం కూడా ఇదే. ప్రతి వేసవిలో బోసిపోయే ఈ జలపాతం వర్షాకాలంలో జలకళను సంతరించుకుని పర్యాటకులను కనువిందు చేస్తుంది. దట్టమైన అభయారణ్యంలో సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి ఏడు బావుల ద్వారా జాలువారుతూ సహజ సిద్దంగా ఏర్పడింది. వర్షాకాలంలో పర్యాటకులు పెద్ద సంఖ్యలో జిల్లా నుంచేకాక ఇతర జిల్లాల నుంచి వస్తుంటారు. ఇంత ప్రఖ్యాతిగాంచిన జలపాతం వద్ద సరైన రక్షణ చర్యలు చేపట్టకోవడం విమర్శలకు తావిస్తోంది.
కొన్నేండ్లుగా ఏడు బావుల జలపాతం వద్ద ఏటా ఒకరిద్దరు మృతి చెందుతున్నారు. గతేడాది వరుసగా రెండు రోజుల్లో రెండు శవాలు అనుమానస్పదంగా బయటపడ్డాయి. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. అయినా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. జలపాతం వద్ద కింది బావి నుంచి పై బావులకు ఎక్కేటపుడు ఏ మాత్రం నిర్లక్ష్యం జరిగినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఆ రాళ్ళ గుట్టల పై నాచు పేరుకుపోయి ఉంటుంది. ఈ బావుల్లో పడే వారు ఈత వచ్చినా బయటకు రావడం కష్టంగా మారి మరణించే ప్రమాదం ఉంది. కానీ, హెచ్చరిక బోర్డులు గానీ, సూచికల బోర్డులు కానీ ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగినపుడు అధికారులు హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలొస్తున్నాయి. జలపాతాన్ని చూసి రావాలంటే ఎంట్రీ పాయింట్ నుంచి జల పాతానికి 4 కిలోమీటర్ల వరకు అటవి ప్రాంతంలోనే ప్రయాణించాలి. ప్రమాదవశాత్తు ఎలాంటి ప్రమాదం సంభవించినా అక్కడి నుంచి తీసుకురావడం కష్టతరమే. జలపాతం వద్దే యువకులు మందు కొడుతూ, జల్సాలు చేస్తున్నారు. అయినా అధికారులు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఇప్పటికైనా ఏడు బావుల జలపాతాన్ని పర్యాటక ప్రదేశంగా గుర్తించి కనీస రక్షణ చర్యలు తీసుకోవాలని, సంబంధిత అధికారులు గైడ్లను నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు.