Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలోని తెలంగాణ గిరిజన గురుకుల బాలుర పాఠశాలలో విద్యార్థినిని పీఈటీ మూడు రోజుల క్రితం దుర్భాషలాడుతూ కొట్టడం వివాదస్పదంగా మారింది. గత నెల 18న కొందరు విద్యార్థులను తల్లిదండ్రుల ఎదుట శిక్షిస్తున్న క్రమంలో అక్కడ ఉన్న కొందరు రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఈ విషయంపై గురుకుల పాఠశాలల రీజినల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి ఎర్రయ్య విచారణ చేపట్టారు. విద్యార్థి కొట్టడానికి గల కారణాలు ఆరా తీసి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి లిఖితపూర్వక పత్రం తీసుకున్నారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని ఆర్సిఓ రాజ్యలక్ష్మి తెలిపారు. ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. విచారణ సమయంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ముత్తయ్య ఉపాధ్యాయులు ఉన్నారు.
చర్యలు తీసుకోవాలి : ఎస్ఎఫ్ఐ
దామరవంచ గురుకుల పాఠశాలలో విద్యార్థినిని పీఈటీ శిక్షించిన ఘటన తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ బందం పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సంఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సాయికుమార్, డివిజన్ కార్యదర్శి సూర్యప్రకాష్, డివిజన్ అధ్యక్షులు సందీప్ కోరారు. అనంతరం మహబూబాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్సీఓ రాజ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.