Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత
నవతెలంగాణ-మరిపెడ
ఆపదలో ఉన్న వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని, కూలికి వెళ్లి వరదల్లో చిక్కుకున్న 22మంది కూలీలను ప్రభుత్వం, అధికార యంత్రాంగం శ్రమించి 18 గంటల్లో రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడటం ఆనందంగా ఉందని ఎంపీ, టీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని చావ్లా తండాలో వరద బాధిత కూలీలను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు, జెడ్పీటీసీ తేజావత్ శారదా రవీందర్‌తో కలిసి ఆమె పరామర్శించారు. వారికి ఒక నెలా సరిపడా నిత్యావస రాలు, రూ.3000 ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.... 22మంది ప్రాణాలతో బయట పడ్డారని, అంతటి విపత్కర పరిస్థితుల్లో 17 మంది మహిళలు ధైర్యంగా ఉండటం సామాన్య విషయం కాదన్నారు. అందులో ఓ మహిళ ప్రతినిధి ఉండటం, ఆమె సెల్ ఫోన్ ద్వారా అందరికి విషయం చేరవేయటంతో నేడు అంతా సురక్షితంగా బయటపడ్డారన్నారు. ఎమ్మెల్యే రెడ్యా నాయక్ హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ విషయం తెలుసుకుని స్థానిక నాయకులు తేజవత్ రవీందర్, తేజవత్ బాలాజీ లను అక్కడికి పంపి, అధికారులు, పోలీసుల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటూ అధికారులతో మాట్లాడి కూలీలను ఒడ్డుకు చేర్చేందుకు కృషి చేశారన్నారు. విపత్కర పరిస్థితి నుంచి క్షేమంగా కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందానికి, రాత్రంతా శ్రమించిన అధికారులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. వానలు అధికంగా కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోతట్టు ప్రాంతాలు, చేపల వేటకు, ప్రమాదకర విద్యుత్ స్తంభాలు జోలికి పోకుండా ఉండాలని సూచించారు. అలుగు పొసే చెరువుల వద్దకు వెళ్ళొద్దని తెలిపారు. అనంతరం ఆర్లగడ్డ తండాలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న బదావత్ రవి, బాలి దంపతులకు నిత్యావసరాలు, నగదు సాయం చేశారు. ఆమె వెంట రామడుగు అచ్యుత రావు, జడ్పీ కో ఆప్షన్ మహబూబ్ పాషా, మాజీ జెడ్పీటీసీ బాలనే మాణిక్యం, తెరసా జిల్లా నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి, మూల మురళీధర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ సభ్యులు వెంకట్ రెడ్డి, తెరాస చిన్నగూడూర్ పార్టీ అధ్యక్షుడు రాంసింగ్, నాయకులు పాదురీ రామచంద్ర రెడ్డి, ఉమ్మడి తానంచర్ల లోనీ ఆరు జీపీల సర్పంచ్ లు, గ్రామ శాఖా అధ్యక్షులు, నాయకులు బాలాజీ నాయక్, సోమన్న, శీనునాయక్, రెడ్యా, శంకర్, రఘు, మంచా, బాలాజీ, తావుర్యా, మాజీ సర్పంచ్ వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.