Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రుల దిష్టిబొమ్మలు దహనం
- అడ్డుకున్న పోలీసులు, తోపులాట
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం... ఇనుగుర్తి గ్రామ నిరసనలతో భగ్గుమంది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన నూతన మండలాల జాబితా లో ఇనుగుర్తి పేరు లేకపోవడం తో ఆదివారం ఉదయం నుంచి మండల సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ శవ యాత్ర నిర్వహిం చారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి నిరసనకారులను అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా మండల సాధన సమితి కన్వీనర్ చిన్నాల కటయ్య మాట్లాడుతూ... నేడు ఇనుగుర్తి గ్రామం విద్రోహ దినంగా పేర్కొంటూ బంద్ పాటిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగనివ్వం అని హెచ్చ రించారు. ఉప ముఖ్యమంత్రి హౌదాలో కడియం శ్రీహరి హామీ ఇచ్చినా నేటికి నెరవేరలేదని తెలిపారు. రిలే నిరాహార దీక్షలు. ఆమరన నిరాహార దీక్షలు, పలు నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఫలితం లేదన్నారు. విడతలవారీగా మండలాలను ప్రకటించిన ప్రభుత్వం ఇనుగుర్తి గ్రామాన్ని ప్రస్తావించకపోవడం దారుణమన్నారు. గతంలో గ్రామస్తులు అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ మంత్రి కడియం శ్రీహరినీ అడ్డుకున్నారని, గ్రామాన్ని మండలంగా ప్రకటించిన తరువాతే ఓట్లు అడుగుతాం అని హామీ కూడా ఇచ్చారని గుర్తు చేశారు. ఈనెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ కురవి మండలం సీరోల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించారని, కానీ, ఇనుగుర్తి గ్రామాన్ని మండలంగా ప్రకటించలేదని అన్నారు. ఇప్పటికైనా ఇను గుర్తిని మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేసముద్రం ఎస్ఐ రమేష్ బాబు, గూడూరు ఎస్ఐ సతీష్, మహబూబాబాద్ రూరల్ ఎస్ఐ దీపిక, పోలిస్ సిబ్బంది భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.