Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31వ డివిజన్లో నిర్లక్ష్యం
- ప్రకృతి వనం, స్మశాన వాటిక ఊసే లేదు
నవతెలంగాణ-హనుమకొండ
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి నాలుగు విడతలు పూర్తయినా హనుమకొండ జిల్లా కేంద్రంలోని 31వ డివిజన్ పరిధిలోని న్యూ శాయంపేటలో పట్టణ ప్రగతి జాడే లేదన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. అన్ని డివిజన్లలోనూ స్మశాన వాటికలు, పట్టణ ప్రకతి వనాలు, రోడ్డు వెడల్పు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి దాదాపు 15 రోజులపాటు నాలుగు విడతలుగా పట్టణ ప్రగతి చేపట్టింది. కాగా న్యూశాయంపేట ఏరియాలో పరిధిలో వైకుంఠధామాలు, పట్టణ ప్రకృతి వనాలు, రోడ్డు వెడల్పు, తదితర లాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. చిన్న పాటి పల్లెల్లోనూ పల్లె ప్రగతి ద్వారా వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, పల్లె క్రీడా ప్రాంగణాలు, డంపింగ్ యార్డులు, నర్సరీ లు దర్శనమిస్తున్నాయి. కానీ అత్యంత ప్రాశస్య్తం కలిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపాల్టీ పరిధిలోని న్యూశాయంపేట ఏరియాను పరిశీలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. న్యూశాయంపేట చౌరస్తా నుంచి ప్రభుత్వ పాఠశాల మీదుగా ఫారెస్ట్ ఆఫీసు వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమై ప్రజలను, వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. దీంతో వరంగల్ నుంచి న్యూశాయంపేట మీదుగా కాజీపేటకు వెళ్లే ఆర్టీసీ లోకల్ బస్సు కూడా రద్దు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై వెళ్లే ద్విచక్ర వాహనదారులు రాత్రివేళల్లో గుంతల్లో పడి గాయాల పాలౌతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రధాన రహదారిని వెడల్పు చేసి, డివైడర్లను నిర్మించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డివిజన్ ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించాలి
వేల్పుల రాజ్‌కుమార్, వాటర్ ప్లాంట్ నిర్వాహకుడు న్యూశాయంపేట
హనుమకొండ జిల్లా కేంద్రంలో హనుమకొండ-ఖమ్మం వెళ్లే జాతీయ రహదారిపైన ఉండి అత్యంత ప్రాశస్త్యం కలిగిన న్యూశాయంపేట ఏరియాలోని ప్రధాన రహదారి గుంతలమయం అయ్యింది. ద్విచక్ర వాహనాలు, ఆటోలు ప్రమా దాల బారిన పడుతున్నాయి. వాహనాలు దెబ్బ తింటున్నాయి. వ్యాపారాలు సైతం నడవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డును బాగు చేయాలి.
తూర్పువాడ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ కూడా కరువే
నర్మెట శ్రీనివాస్, బీజేపీ అనుబంధ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీనమై ఏండ్లు గడుస్తున్నా 31వ డివిజన్ పరిధిలోని (న్యూశాయంపేట) ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధి చెందడం లేదు. డివిజన్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రహదారి విస్తరణ లేదు. అంతర్గత రోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, వైకుంఠధామల ఊసే లేదు. పట్టణ ప్రకతి వనాలు కూడా ఏర్పాటు చేయలేదు. తూర్పువాడ స్మశాన వాటికకు కాంపౌండ్ వాల్ కూడా కరువే అయ్యింది. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేయాలి.