Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం
నవతెలంగాణ-మహాదేవ్‌పూర్
సుమారు 10 రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్సాలకు మండలంలోని వేలాది ఎకరాల్లో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 1986 తర్వాత మండలంలో ఇంత భారీ వర్షం కురిసి, వరదలు రావడం తొలిసారి అని ప్రజలు అంటున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల వేలాది ఎకరాల్లో పత్తి, వంద ఎకరాల్లో వరి నారు మడులు, వందలాది ఇండ్లు కూలిపోయాయి. అలాగే ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కాళేశ్వరం పుష్కరఘాట్ నీటిలో మునిగిపోవడంతో చిరు వ్యాపారస్తులు భారీగా నష్టపోయారు. అలాగే మండల కేంద్రం నుంచి గోదావరి వరకు రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. సూరారం ఆర్ అండ్ బీ రోడ్డు సైతం గుంతలమయమైంది. ఈ క్రమంలో సబ్ స్టేషన్ దగ్గర వంతెన సైడు ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని పూసుకు పల్లి, పలుకుల, అన్నారం, మద్దులపల్లి, సెంటర్పల్లి, కాళేశ్వరం ఎస్టీ కాలనీ, సూరారం ఎస్టీ కాలనీ వరదలో చిక్కుకోగా ప్రజలు పునరావాస కేంద్రాల్లో తల దాచుకున్నారు. మండలంలో సుమారు 200 ఇండ్లు కూలిపోగా 13 వందల ఎకరాల పత్తి నారుమడులు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. మండలంలో మొత్తం 25 వందల ఎకరాల్లో నష్టం జరిగిందని రైతులు తెలిపారు. చెరువులో మత్తడి పడి కిందున్న పొలాలకు నష్టం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మేడిగడ్డ నుంచి అన్నారం వరకు గోదావరి పరివాహక ప్రాంతాలైన గ్రామాలకు చెందిన అనేక మంది రైతులకు చెందిన పత్తి చేన్లు, వరిపొలాలు నీట మునిగిపోయి రైతులు కోలుకోలేని రీతిలో నష్టపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సర్వే చేయించి నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులను, ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని మండల ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.