Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎంపీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసాని అయిలయ్య
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
గొర్రెల పంపిణీలో అవకతవకలకు తావులేకుండా గొల్ల కురుమల ఖాతాల్లో నగదు బదిలీ పథకం చేపట్టాలని జీఎంపీఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసాని అయిలయ్య డిమాండ్ చేశారు. హన్మకొండలోని రాంనగర్లో రాష్ట్ర అధ్యక్షుడు కిల్లే గోపాల్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశంలో అయిలయ్య మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ మొదలు పెట్టి ఐదేండ్లు గడుస్తున్నా మొదటి విడత పూర్తి చేయ్యలేదని విమర్శించారు. పంపిణీ చేసిన చోట అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. పథకంతో అధికారులు, బ్రోకర్లు మాత్రమే లబ్ది పొందారని ధ్వజమెత్తారు. గొల్ల కురుమలకు నగదు బదిలీ చేస్తే వారికి నచ్చిన చోట గొర్రెలు కొనుగోలు చేసుకొనే అవకాశం ఉందన్నారు. అలాగే పెరిగిన పశుసంపదకు అనుగుణంగా వైద్యం అందడం లేదని, గ్రామాల్లో జీవాలపై కుక్కల దాడులు చేసి చంపిన సందర్భాలున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెలు, మేకలన్నిటికీ ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కల్పించాలని, జీవాల కోసం షెడ్లు నిర్మించి దొంగలు, జంతువుల బారి నుంచి కాపాడాలని, ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెల కాపరులకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గ్రామాల్లోని ప్రభుత్వ భూములను సొసైటీలకు రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. వత్తి సంఘాల సమావేశం కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంవీ రమణ మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల రోజురోజుకు వత్తులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా వత్తిదారులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అవిశెట్టి శంకరయ్య, తుషాకుల లింగయ్య, సాదం రమేష్, కాడబోయిన లింగయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులు బొల్లం అశోక్, తదితరులు పాల్గొన్నారు.