Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
- పీఎస్ఏడీఏ తొలి సమావేశం
నవతెలంగాణ-ములుగు
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య అధ్యక్షతన పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పీఎస్ఏడీఏ) తొలి సమావేశాన్ని గురువారం నిర్వహించగా ముఖ్యఅతిథిగా సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొని యునెస్కో విధించిన ఎనిమిది అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఆలయానికి హద్దులు నిర్ణయించడంతోపాటు బఫర్ జోన్ నిర్ణయించాలని, పేర్కొన్నట్లు తెలిపారు. దీనికోసం పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుచేసి ఇందులో సిబ్బందిని కేటాయించి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీని ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తూ హద్దులు నిర్ణయించి బఫర్ జోన్లను నిర్ణయించనున్నట్లు తెలిపారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు ద్వారా కంబోడియా, థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాలకు పర్యటించి రామప్ప ఆలయంతో పోలిన దేవాలయాలను గుర్తించి పరిశోధన నివేదిక సిద్ధం చేస్తున్నదని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఐసిఎంపి) తయారు చేసేందుకు రుద్రేశ్వర ఆలయానికి ప్రాంతీయ పర్యాటక అభివద్ధి ప్రణాళికను రూపొందించినట్టు తెలిపారు. యునెస్కో నిబంధనల మేరకు రామప్ప దేవాలయ పరిరక్షణకు అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో బడ్జెట్ ప్రణాళికలు సిద్ధం చేసి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మౌలిక వసతులను కల్పించేందుకు ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. జీవో నెంబర్ 117 ప్రకారం జులై 5వ తేదీన పాలంపేట స్పెషల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి రక్షిత ప్రాంతంలో ఉన్న అన్ని ఆలయాలను పరిరక్షించి పునరుద్ధరించనున్నట్లు తెలిపారు. రామప్ప సరస్సు సైతం సంరక్షించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సహజ సిద్ధమైన పర్యావరణాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏఎస్ఐ ప్రతిపాదనలు సిద్ధం చేసి సాంకేతిక అంశాలపై దష్టి సారించి పునర్నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు. అనాస్టిలోసిస్ సూత్రాన్ని అనుసరించి కామేశ్వర ఆలయాన్ని పునర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సీతక్క, ఐటీడీఏ పీఓ అంకిత్, జిల్లా అడిషనల్ కలెక్టర్లు ఇలా త్రిపాటి, గణేష్, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్, పాలంపేట స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ సభ్యులు, కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
రామప్ప ఆలయ సందర్శన
వెంకటాపురం : మండలంలోని పాలంపేటలోని రామప్ప ఆలయాన్ని రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సందర్శించారు. ఆయనకు ఆలయ పూజలు హరి శర్మ ఉమాశంకర్ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య, ఎమ్మెల్యే సీతక్క, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారి స్మిత ఎస్ కుమారిలతో కలసి ఆలయ అభివృద్ధి పనులను సందీప్‌కుమార్ పరిశీలించి మాట్లాడారు. రామప్పలో అభివద్ధి పనులను చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పర్యటించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ హెరిటేజ్ సభ్యులు పాండురంగారావు, టూరిజం ఎండీ మనోహర్‌రావు, డీటీఓ శివాజీ, అసిస్టెంట్ టూరిజం అఫిసర్ సూర్యకిరన్, ఈఈ సాంబయ్య, కేంద్ర పురావస్తు శాఖ సీఏ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.