Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరకాల నియోజకవర్గంలో హల్చల్
- వెలుగుచూస్తున్న అక్రమ సంబంధాలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులకు పట్ట పగ్గాల్లేని పరిస్థితి నెలకొంది. సంక్షేమ పథకాల బూచితో మహిళలను లోబర్చుకోవడమే కాకుండా ఉద్యోగులపై సైతం దాడులు చేయడం పరిపాటిగా మారింది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో ముఖ్యంగా ఆత్మకూరు మండలంలో 'చల్లా' కోటరీ ఆరితేరింది. ఎమ్మెల్యే బావమరిది, ఎమ్మెల్యే సామాజికవర్గానికి చెందిన నేతలు సంక్షేమ పథకాల బూచి చూపించి వారిని లోబరుచుకోవడం ఇటీవలె సామాజిక మాధ్యమాల్లో ఒక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఆడియో లీకు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్న చందంగా ఎమ్మెల్యే అనుచరులు చేసిన తప్పిదాలను వెనుకేసుకురావడం నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. శాయంపేట మండలానికి చెందిన ఏపీఎంపై ఎమ్మెల్యే అనుచరుడు దాడి చేసి కొట్టడంతో ఎపిఎం తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయంలో ఉద్యోగ సంఘాలు సైతం పెదవి విప్పకపోవడం గమనార్హం. ఇదిలావుంటే ఉద్యోగులను సైతం పిలుచుకొని విషయం బయటకు పొక్కనీయకుండా ఎమ్మెల్యే జాగ్రత్తలు చేపట్టడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఎమ్మెల్యే అనుచరులు ఎంత చెండాలమైన పని చేసినా ఎమ్మెల్యే మంత్రం చర్యలు తీసుకోకపోవడం ఆయన వ్యవహారశైలికి నిదర్శనం.
పరకాల నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్‌గానే వుంటుంది. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరుల హల్చల్తో నియోజకవర్గం ఎప్పుడు చర్చల్లోనే వుంటుంది. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు కోటరీగా మారి అసలైన లబ్దిదారులకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే వెంట నాడు ఆయనతోపాటు టీడీపీ నుండి వచ్చిన నేతలకే ప్రాధాన్యత దక్కుతుండడంతో ఉద్యమం నాటి నుండి పార్టీలో వున్న వాళ్లు చేసేదేమి లేక పక్కకు జరిగారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో నియోజకవర్గాలకు ఎమ్మెల్యేనే బాస్ కావడంతో ఎమ్మెల్యేలు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది.
మహిళలను లోబరుచుకోవడం..
నియోజకవర్గంలో పలు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరులు కోటరీగా ఏర్పడి అభివృద్ధి కార్యక్రమాలలో వారి ఆమోదం ఉంటేనే అందే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే వరకు పేదలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో కోటరీ నేతల అరాచకాలకు అమాయకులు బలవుతున్నారు. ఇటీవల ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన అధికార టిఆర్ఎస్ ప్రజాప్రతినిధి ఒక వివాహితతో చేసిన ఫోన్ సంభాషణ లీకై సామాజిక మాధ్యామాల్లో వైరల్ అయ్యింది. అయినా సదరు నేతపై ఎమ్మెల్యే చర్యలు తీసుకోకపోవడంతో ఇలాంటి అశ్లీల కార్యక్రమాలకు ఎమ్మెల్యే మద్దతు వుందన్న ప్రచారం సాగింది.
ఏమి 'కేశవా'...
శాయంపేట మండల కేంద్రంలో మండల సమైక్యలో పనిచేస్తున్న ఒక వివాహితతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బావమరిది అక్రమ సంబంధం నెరిపినట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఆ మహిళ ఆత్మకూరు మండలంలో పనిచేసి ప్రస్తుతం శాయంపేట మండలంలో పనిచేస్తుంది. విధి నిర్వహణలో వున్న సదరు మహిళలను ఎప్పుడు పడితే అప్పుడు ఎమ్మెల్యే బావమరిది కారులో తీసుకుపోవడం ఆరోపణలకు బలం చేకూరింది. ఈ క్రమంలో ఎపిఎం ఈ విషయంలో మందలించడంతో సదరు ఎపిఎం శాయంపేట-గూడెప్పాడ్ మార్గమధ్యంలో మల్లక్‌పేట వద్ద కాపు కాసి ఎమ్మెల్యే బావమరిది అనుచరులు తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో సదరు ఉద్యోగి చేయి విరిగింది. ఇది లీకవడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే ఉద్యోగులను పిలుచుకొని రాజీ కుదిర్చినట్లు ప్రచారం జరిగింది. రాజీ కుదర్చడం తప్పా ఎమ్మెల్యే తన అనుచరులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారాయి. తన అనుచరులపై ఈగ వాలనీయకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఎమ్మెల్యే వైఖరిపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతుంది.