Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిడ్జిపై భారీ గుంతలు
- ఆందోళనలో ప్రయాణికులు పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-మల్హర్రావు
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దులోని మానేరుపై నిర్మించిన అడవి సోమన్‌పల్లి వంతెన డేంజర్ జోన్‌కు చేరింది. పెద్దపల్లి జిల్లాలోని మంథని మండలంలోని సోమన్‌పల్లి, భూపాలపల్లి జిల్లాలోని మల్హర్ మండలంలోని కొయ్యుర్ గ్రామ పరిధిలోని పివినగర్ సరిహద్దుల్లో మానేరు నదిపై వంతెనను 1971లో ప్రారంభించారు. అప్పటివరకు తూర్పు ప్రాంతాలకు వెళ్లాలంటే మంథని మండలంలోని ఆరెంద, వెంకటాపూర్ గ్రామాల్లోని మానేరు మీదుగా పడవల్లో దాటి అప్పటి తాడిచెర్ల (ప్రస్తుతం మల్హర్రావు) మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చేరుకొని ప్రయాణించాల్సి వచ్చేది. మారుమూల ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధిలో భాగంగా ఈ వంతెన నిర్మించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి సదర్శకుల రాకపోకలతోపాటు తూర్పు మండలాలకు, భూపాలపల్లి, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ పట్టణాలకు రహదారి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. కానీ ప్రస్తుతం ఈ వంతెన ప్రమాదకరంగా మారింది. వంతెన మీదున్న రహదారి సిమెంట్ కొట్టుకుపోయి, వంతెన పిల్లర్ల మధ్య వేసిన ఇనుప రాళ్ల పట్టీలు ఊడిపోయి పెద్ద సైజులో గుంతలు ఏర్పడ్డాయి. ప్రయాణికులు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇరువైపులా సరిహద్దుల్లో వేసిన రోడ్డు సైతం పెద్ద గుంతలు ఏర్పడి కంకర తేఇ భయానకంగా తయారైంది. ఈ వంతెన మీదుగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రయాణాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంతెన మీదుగా నిత్యం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు మంథని నుంచి కొయ్యుర్ మీదుగా కాటారం, కాళేశ్వరం, భూపాలపల్లికు వాహనాలపై రాకపోకలు సాగిస్తారు. ఇసుక రీచ్‌ల నుంచి నిత్యం వందల సంఖ్యలో లారీలు ఇదే వంతెన మీదుగా ప్రయాణిస్తాయి. ఇకనైనా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
మరమ్మతులు చేపట్టాలి : అక్కల బాపు యాదవ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల సరిహద్దుల్లోని అడవి సోమన్‌పల్లి బ్రిడ్జికి ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వంతెనపై ఉన్న సిమెంట్ తొలగిపోయి రాడ్లు, పట్టీలు పైకి తేఇ భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఈ వంతెన మీదుగా ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు భయాందోళనకు గురౌతున్నారు. ఎటువంటి ప్రమాదాలు జరగకముందే వంతెనను బాగు చేయాలి.