Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31వ వర్ధంతి
నవతెలంగాణ-ఎన్జీఓస్ కాలనీ
ఏసిరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై పోరాడాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యుడు సారంపెల్లి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. ఏసిరెడ్డిని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడుగా వాసుదేవరెడ్డి అభివర్ణించారు. హనుమకొండ రాంనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి 31వ వర్ధంతిని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏసిరెడ్డి నర్సింహారెడ్డి చిత్రపటానికి వాసుదేవారెడ్ది పూలమాలవేసి విప్లవ జోహార్లు అర్పించి మాట్లాడారు. ఏసిరెడ్డి నర్సింహారెడ్డి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రక్ష్యక్షంగా పాల్గొని నైజాం సర్కారుకు, దొరలకు ఎదురొడ్డినట్టు తెలిపారు. రజాకార్ల దాడిలో కుడి కాలు తొడలో బుల్లెట్ దిగినా పోరాటం కొనసాగించాడని కొనియాడారు. ఎమ్మెల్యేగా పని చేసినా ఆస్తులు సంపాదించుకోలేదని, సమాజం కోసం వివాహం కూడా చేసుకోలేదని వివరించారు. చనిపోయే నాటికి ఒంటిపై ఉన్న డ్రెస్సుతోపాటు అదనంగా మరొక డ్రెస్సు మాత్రమే కలిగిన త్యాగశీలిగా కీర్తించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు డి తిరుపతి, ప్రజాసంఘాల నాయకులు ఎం చుక్కయ్య, గొడుగు వెంకట్, జంపాల రమేష్, మాడరాజు రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.