Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ బండ ప్రకాష్
నవతెలంగాణ-హనుమకొండ
వేల ఏండ్లుగా ఉత్పత్తిలో, శ్రమలో పాల్గొని మానవాళి మనుగడకు ఎనలేని సేవ చేస్తున్న ఉత్పత్తి కులాలు, బీసీల గురించి మరింత సాహిత్యం రావాలని ఎమ్మెల్సీ డాక్టర్ బండ ప్రకాష్ అన్నారు. డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్ రచించిన బీసీ చౌక్ (వ్యాసాల సంకలనం) పుస్తకాన్ని హన్మకొండ జిల్లా కేంద్రం హంటర్ రోడ్ లో శుక్రవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మానవాళి సకల అవసరాలకు సంబంధించిన వస్తవులను తయారు చేస్తున్న భారతీయ శాస్త్రవేత్తలైన బి.సి కులాల చరిత్ర, వారి నైపుణ్యాలను, వారి కష్టాలను సమాజానికి తెలియజేస్తున్న యువ రచయిత డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్‌ను అభినందించారు. ఇలాంటి మరెన్నో రచనలను తీసుకురావడంలో ప్రవీణ్ కుమార్‌తో పాటు బీసీ కవులు, రచయితలు కషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రంథ రచయిత చింతం ప్రవీణ్ మాట్లాడుతూ... చమట చుక్కలు చిందించి ప్రతి పనిలో కీలకపాత్ర పోషిస్తున్న బీసీల గురుంచి తగినంత సాహిత్యం రావడం లేదని అన్నారు. అస్థిత్వ ఉద్యమాల్లో, సాహిత్యంలో బీసీ శ్రమకు తగినంత గుర్తింపు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఉత్పత్తి, శ్రమలో పాల్గొనకుండా ఉత్పత్తి శ్రమను అనుభవించే వారి సాహిత్యమే ఎక్కువ ప్రాచుర్యంలో ఉందని అన్నారు. ఆ స్థితిని మార్చి కష్ట జీవుల నిజమైన చరిత్రను సమాజానికి చాటి చెప్పడానికి నాలాంటి యువ కవులు ఎందరో ఉన్నారని, వారికి సరైన సహకారం అందివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ సాయిని నరేందర్, బీసీ పొలిటికల్ ఫోర్స్ వరంగల్ జిల్లా నాయకులు చిర్ర రాజేష్ కన్నాగౌడ్, న్యాయవాదులు రాచకొండ ప్రవీణ్, తులిసెగారి రాజబాపు, పీపుల్స్ డెమొక్రటిక్ మూమెంట్ నాయకులు సోమ రామమూర్తి, బీసీ కులాల ఐక్య వేదిక జిల్లా నాయకులు సిద్ధిరాజు, అసంఘటిత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నలిగింటి చంద్రమౌళి, వివిధ సంఘాల నాయకులు పులి రజనీకాంత్, యాదగిరి, బొమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.