Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణాల దాక విక్రయాల జోరు
- ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని పల్లెలు, మారుమూల తండాల్లో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుగా తయారు చేసి రహస్యంగా పల్లెల నుంచి పట్టణాల వరకు విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు. అయినా గుడుంబా తయారీ మూలాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జోరుగా నాటుసారా తయారీ...
మండలంలో నాటుసారా తయారీ జోరందుకుంది. మద్యం ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి మందుబాబులు తక్కువ ధరలో లభించే గుడుంబా పట్ల ఆసక్తి చూపుతున్నారు మండలంలోని వివిధ ప్రాంతాల్లో నాటాసారా విచ్చలవిడిగా తయారవుతోంది. గుట్టుగా ప్లాస్టిక్ కవర్లలో నింపి రవాణా చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై ఇతర గ్రామాలు, పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. కొందరు సారా తయారీనే వత్తిగా మల్చుకుని అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగిన రోజుల్లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేసేలా బెల్లం తయారీని నిషేధించింది. అలాగే సారా తయారీకి అలవడ్డ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించారు. కాగా ఇటీవల మళ్లీ సారా తయారీ జోరందుకుందని తెలుస్తోంది. కొందరు కుళ్లిన పండ్లతో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు పటికి బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి వ్యాపారం సాగిస్తున్నారు.
నాటుసారా వైపు.. మందుబాబుల చూపు..
మద్యం ధరలకు రెక్కలు రావడంతో పేద, మధ్య తరగతి మందుబాబులు తక్కువ ధరకు లభించే నాటుసారా వైపు ఆసక్తి చూపుతున్నారు. మద్యం తాగాలంటే వందలాది రూపాయలు అవసరం ఉండగా గుడుంబా, నాటుసారా అతి చౌకగా లభిస్తోందన్న వాదన్న వినవస్తోంది. మండల కేంద్రంలో, కొన్ని గ్రామాల్లో గుడుంబా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
ఎక్సైజ్ అధికారుల నిఘా కరువు
మండలంలో గుడుంబా, నాటుసారాపై ఎక్సైజ్ శాఖ నిఘా కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించడం లేదని ప్రజలు బహిరంగంగానే మండిపడుతున్నారు. వ్యవ సాయ పనుల సీజన్ కావడంతో పంట చేల వద్ద గుట్టుగా తయారు చేస్తున్నారు. అయితే అప్పుడప్పుడు ఎక్సైజ్ అధికారులు తండాలపై దాడులు చేస్తున్నా మూలాలను విస్మరిస్తున్నా రన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సారా తయారీ కేంద్రాలపై దాడులు చేస్తే గుడుంబాను నుంచి పేద, మధ్య తరగతి ప్రజలను కాపాడొచ్చన్న వ్యాఖ్యలున్నాయి. ఇప్పటికైనా మండలంలో గుడుంబా నియంత్రణకు ఎక్సైజ్ శాఖ అధికారులు కంకణబద్దులు కావాలని ప్రజలు కోరుతున్నారు.